Share News

రాజ్‌కోట్‌ గేమింగ్‌జోన్‌ ప్రమాద తీవ్రతకు కారణం అదే!

ABN , Publish Date - May 27 , 2024 | 05:44 AM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో శనివారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. వీరిలో 12 మంది చిన్నారులున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ప్రమాదంలో..

రాజ్‌కోట్‌ గేమింగ్‌జోన్‌ ప్రమాద తీవ్రతకు కారణం అదే!
gaming zone

  • ఫైబర్‌డోమ్‌ వెల్డింగ్‌ పనుల వల్లే ప్రమాదం!!

  • 12 మంది చిన్నారులు సహా.. 35కు పెరిగిన మృతులు

  • కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు

  • సోమవారం అత్యవసర విచారణ.. నోటీసులు

    Untitled-4 copy.jpg

రాజ్‌కోట్‌, మే 26: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో శనివారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. వీరిలో 12 మంది చిన్నారులున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ప్రమాదంలో.. అన్నీ కన్నీళ్లు తెప్పించే మానవీయ కోణాలే..! పెళ్లయిన నాలుగో రోజే మృత్యువు ఒడికి చేరుకున్న టెకీ.. చిన్నపాటి కాలిన గాయమైతేనే గిలగిల కొట్టుకునే ఓ 15 ఏళ్ల బాలుడు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి గల్లంతు.. ఇలా ఏ బాధిత కుటుంబాన్ని కదిలించినా.. కన్నీటి కథలే..!

గేమింగ్‌ జోన్‌లోని గో-కార్ట్‌లో ఉన్న టైర్లు, కలప నిర్మాణాలు, ఫ్లెక్సీలతోపాటు.. భారీగా ఉన్న పెట్రో నిల్వలు కూడా మంటలు క్షణాల్లో వ్యాపించడానికి దోహదపడ్డాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. జనరేటర్ల కోసం 1,500 లీటర్ల మేర డీజిల్‌, గో-కార్ట్‌ వాహనాల కోసం మరో 2 వేల లీటర్ల పెట్రోల్‌ నిల్వలు ఉన్నాయని, వాటివల్లే ప్రమాద తీవ్రవ పెరిగిందని వివరిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమై ఉండొచ్చని భావిస్తున్నా..

ఆ సమయంలో ఫైబర్‌డోమ్‌ వద్ద వెల్డింగ్‌ పనులు జరుగుతున్నాయని, నిప్పురవ్వల కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. గేమింగ్‌ జోన్‌లోని బౌలింగ్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు లభించాయని, నిర్వాహకులు అక్కడ పార్టీ ఏర్పాటు చేసి ఉంటారని, దానివల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ప్రమాదం జరిగిన సమయంలో గేమింగ్‌ జోన్‌లో మొత్తం 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడం.. ప్రవేశానికి-నిష్క్రమణకు ఏడడుగుల దాకా ఎత్తు ఉన్న ఒకే ద్వారం ఉండడం ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు గుజరాత్‌ హైకోర్టు ఈ ఘటనపై సుమోటోగా కేసును స్వీకరించింది. దీనిపై సోమవారం అత్యవసరంగా విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌, వడోదర, రాజ్‌కోట్‌, సూరత్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ల తరఫు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసింది.

  • మా బాధ్యత కాదు?

టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌ నిర్వాహకులు చట్టపరంగా తప్పించుకునేందుకు ముందు నుంచి పకడ్బందీగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గేమింగ్‌ జోన్‌లోకి వెళ్లే ముందే కన్సెంట్‌ ఇచ్చేలా ఫారాలను అందజేస్తారని స్థానికులు తెలిపారు. ‘‘లోపల గేమింగ్‌ సమయంలో కస్టమర్‌కు ఏదైనా జరగరానిది జరిగితే.. టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌ది బాధ్యత కాదు’’ అని రాసి ఉన్న ఆ కన్సెంట్‌పై సంతకాలు తీసుకుంటారన్నారు.

  • నిందితులను కాపాడే యత్నాలు?

ప్రమాద ఘటనపై రాజ్‌కోట్‌ పోలీసు కమిషనర్‌ రాజు భార్గవ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం పలు అనుమానాలకు తావిస్తోందని గుజరాత్‌ మీడియా ఆరోపించింది. నిజానికి రాజ్‌కోట్‌ తాలూకా పోలీసులు ఆరుగురు గేమింగ్‌ జోన్‌ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

గేమింగ్‌ జోన్‌కు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) లేదని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. సీపీ విలేకరుల సమావేశంలో మాత్రం.. ‘‘రాజ్‌కోట్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు ప్రారంభమైంది. గేమింగ్‌ జోన్‌కు 2023లోనే మునిసిపల్‌ కార్పొరేషన్‌, పోలీసుశాఖ, ఇతర అనుమతులు ఉన్నాయి.

ఫైర్‌ ఎన్వోసీ కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది’’ అని వివరించారు.


దీంతో విలేకరులు సీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఫైర్‌ ఎన్వోసీ లేకుండానే పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు’’ అని నిలదీశారు. దీనికి సీపీ సమాధానాన్ని దాటవేయడంతో నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

అంటూ గుజరాతీ మీడియా వార్తలను ప్రసారం చేశాయి. కాగా, గేమింగ్‌ జోన్‌లో మృతుల ఆత్మలు శాంతించాలని కోరుతూ రాజ్‌కోట్‌ వాసులు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బహుమాలి భవన్‌ నుంచి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

  • నిందితులను చంపేస్తాను

అగ్నిప్రమాదంలో మృతిచెందిన రాజ్బా చౌహాన్‌ అనే 15 ఏళ్ల బాలుడి తండ్రి ప్రదీ్‌పసింగ్‌ చౌహాన్‌ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వారిపట్ల ఏమాత్రం కనికరం చూపకూడదని, ఒకవేళ నిందితులు బెయిల్‌పై బయటకు వస్తే.. తానే వారిని చంపేస్తానని హెచ్చరించారు.

‘‘నాకు ప్రభుత్వ నష్టపరిహారాలేమీ వద్దు. నా సర్వస్వాన్ని కోల్పోయాను. నా లక్ష్యం ఒక్కటే..! నిందితులకు బెయిల్‌ వస్తే.. వారిని అంతమొందించడమే..’’ అని గుజరాతీ మీడియా చానళ్లతో అన్నారు.


  • పిల్లల్ని కాపాడబోయి.. తండ్రి కూడా..

వీరేంద్ర సింగ్‌ జడేజా తన ఏడుగురు కుటుంబ సభ్యులతోపాటు శనివారం గేమింగ్‌ జోన్‌కు వెళ్లారు. టీవీలో ప్రమాదం వార్త తెలియగానే అక్కడకు చేరుకున్నానని వీరేందర్‌ తండ్రి చంద్రసింగ్‌ జడేజా మీడియా ముందు కన్నీటిపర్యంతం చెప్పారు.

రాత్రంతా 25 ఆస్పత్రుల చుట్టూ తిరగ్గా.. గిరిరాజ్‌ ఆస్పత్రిలో వీరేందర్‌ కూతురు జిగ్యాబా జడేజా చికిత్స పొందుతూ కనిపించిందని, వీరేందర్‌ భార్య నిర్మల్‌ సింగ్‌ అతని పక్కనే ఉన్నారని చెప్పారు. ‘‘వీరేందర్‌ వారిద్దరినీ సురక్షితంగా గేమింగ్‌ జోన్‌లోంచి బయటకు తీసుకొచ్చారు.

తన పిల్లల్ని-- ధర్మరాజ్‌(15), హితేంద్ర, సోదరి పిల్లలు-- ఓందేవ్‌, దేబాషిబాను కాపాడుకునేందుకు మళ్లీ లోనికి వెళ్లారు. తిరిగి రాలేదు’’ అని వివరించారు. తన డీఎన్‌ఏ నమూనాలు తీసుకున్న అధికారులు.. ఆదివారం సాయంత్రం 4 మృతదేహాలను అప్పగించారని చెప్పారు.

  • పెళ్లైన నాలుగో రోజుకే..

    Untitled-4 copy.jpg

కెనెడాలో చదువుకుని, అక్కడే టెకీగా పనిచేస్తున్న అక్షయ్‌(32) నాలుగు రోజుల క్రితమే పెళ్లైంది. అతని స్వస్థలం రాజ్‌కోట్‌లోని మేఘానీనగర్‌. తల్లిదండ్రులు హీనాబెన్‌, కిశోర్‌బాయ్‌ ఇక్కడే ఉంటారు.

శనివారం వారాంతంలో సరదాగా స్నేహితులతో కలిసి గేమింగ్‌జోన్‌కు వెళ్లాడని, అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి, తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడని అక్షయ్‌ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Updated Date - May 27 , 2024 | 09:27 AM