Share News

Bilkis Bano: బిల్కిస్ బానో కేసు.. దోషుల ముందస్తు విడుదలపై గుజరాత్ నిర్ణయం కొట్టివేత..

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:08 AM

గుజరాత్ అల్లర్లు - 2002 సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబసభ్యులను హతమార్చిన ఘటనలో..

Bilkis Bano: బిల్కిస్ బానో కేసు.. దోషుల ముందస్తు విడుదలపై గుజరాత్ నిర్ణయం కొట్టివేత..

గుజరాత్ అల్లర్లు - 2002 సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబసభ్యులను హతమార్చిన ఘటనలో.. 11 మంది దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, సామాజిక సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను హీరోలుగా చూడడం, వారిని సాదరంగా స్వాగతించడం వంటివి జనాల్లో తీవ్ర అంసతృప్తికి కారణమయ్యాయి. దోషుల విడుదల గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బిల్కిస్ బానో వాపోయారు. ఎలాగైనా న్యాయం చేయాలని సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌తో సహా 11 రోజుల విచారణ తర్వాత జస్టిస్ బీవీ. నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో తన తీర్పును రిజర్వ్ చేసింది. రిమిషన్‌కు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని, గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది. 1992 నాటి చట్టం ఆధారంగా గుజరాత్ ప్రభుత్వం దోషులను విడుదల చేసింది. ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి, సత్ప్రవర్తన ప్రదర్శించారని అందుకే వారిని రిలీజ్ చేస్తున్నట్లు ప్రత్యేక ప్యానెల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది.

ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మోయిత్రా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం.. " దోషుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అటువంటి పరిస్థితిలో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత వారిని ఎలా విడుదల చేశారు.? ఇతర ఖైదీలను ఎందుకు విడుదల చేయలేదు.?" అని ప్రశ్నించింది.


సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం తర్వాత చెలరేగిన మతపరమైన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో.. సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అప్పుడు ఆమె వయస్సు 21 సంవత్సరాలు. అంతే కాకుండా ఆమె గర్భిణీ కూడా. అల్లర్లలో హత్యకు గురైన ఏడుగురు కుటుంబ సభ్యులలో ఆమె మూడేళ్ల కుమార్తె కూడా ఉండటం ఆమెను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 08 , 2024 | 11:27 AM