Share News

ChatGPT AI Video: చెప్తే చాలు.. వీడియో సిద్ధం!

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:14 AM

ChatGPT Video: అడిగిందే తడవుగా అన్నీ చెప్పే ‘చాట్‌ జీపీటీ’తో సంచలనం సృష్టించిన కృత్రిమ మేధ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’..

ChatGPT AI Video: చెప్తే చాలు.. వీడియో సిద్ధం!
ChatGPT Video

కమాండ్ల ఆధారంగా నిమిషం నిడివి గల వీడియోలను రూపొందించే కొత్త ఏఐ మోడల్‌ ‘సోర’

చాట్‌జీపీటీ సృష్టికర్త ‘ఓపెన్‌ ఏఐ’ మరో అద్భుతం

న్యూయార్క్‌, ఫిబ్రవరి 16: అడిగిందే తడవుగా అన్నీ చెప్పే ‘చాట్‌ జీపీటీ’తో సంచలనం సృష్టించిన కృత్రిమ మేధ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’.. ఇచ్చిన ప్రాంప్ట్‌ ఆధారంగా ఒక నిమిషం వీడియోను రూపొందించే మరో కొత్త ఏఐ మోడల్‌తో ముందుకొచ్చింది. దాని పేరు ‘సోర’. చాట్‌ జీపీటీ 4.0 వెర్షన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాక, మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ల ఆధారంగా బొమ్మల్ని కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌ వెర్షనే ఈ వీడియో ఏఐ మోడల్‌ ‘సోర’. ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ దీని గురించి తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘సోర’ ఎన్ని అద్భుతాలు చేయగలదో ప్రజలకు చూపించాలని తాము అనుకుంటున్నామని.. కాబట్టి, ఎవరైనా దాన్ని పరీక్షించాలనుకుంటే తాము చూడాలనుకుంటున్న వీడియోకి సంబంధించి క్యాప్షన్లతో రిప్లై ఇవ్వాలని అందులో కోరారు. దీంతో చాలామంది ‘ఎక్స్‌’ యూజర్లు ఆయన ట్వీట్‌కు సమాధానంగా పలు ప్రాంప్ట్‌లు పంపించారు. వాటిలో కొన్నింటిని ఉపయోగించి ‘సోర’ తయారు చేసిన వీడియోలను శామ్‌ ఆల్ట్‌మన్‌ మళ్లీ పోస్ట్‌ చేశారు. అయితే, కొన్ని కొన్ని వీడియోల్లో మాత్రం చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నట్టు గుర్తించామని.. వాటిని కూడా సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నామని శామ్‌ ఆల్ట్‌మన్‌ వివరించారు. ఈ మోడల్‌ను దుర్వినియోగం చేసి ప్రముఖుల పరువుకు భంగం వాటిల్లే విధంగా వీడియోలు రూపొందించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ లోపాలన్నింటినీ సరిచేసుకున్నాకే అందరికీ అందుబాటులోకి తెస్తామని.. ప్రస్తుతానికి దీన్ని కొంతమంది కంటెంట్‌ క్రియేటర్లకు, నిపుణులకు, లోపాలను గుర్తించి సరిచేసే రెడ్‌ టీమర్స్‌కు మాత్రమే పరిమితం చేశామని చెప్పారు.

‘డాల్‌ ఈ’కి కొనసాగింపు..

ఓపెన్‌ ఏఐ సంస్థ ఇంతకుముందు ఇదే తరహాలో.. కమాండ్‌ ఇస్తే వీడియోలను రూపొందించే ‘డాల్‌ ఈ’ అనే వీడియో జనరేటివ్‌ ఏఐపై కొంతకాలం పనిచేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. ‘డాల్‌ ఈ’ కోసం చేసిన రిసెర్చ్‌ ఆధారంగా ‘సోర’ను అభివృద్ధి చేసింది. మరికొన్ని సంస్థలు కూడా ఈ తరహా టెక్స్ట్‌ టు వీడియో ఏఐ మోడళ్లను గతంలోనే రూపొందించాయి. అమెరికాకు చెందిన ‘రన్‌వే’ అనే స్టార్టప్‌ రూపొందించిన జెన్‌-2 మోడల్‌ ఏఐ ఈ ‘టెక్ట్స్‌ టు వీడియో’ అద్భుతాన్ని 2023లోనే సాధించింది. కాగా, జపనీ్‌సలో ‘సోర’ అంటే ఆకాశం అని అర్థం.

Updated Date - Feb 17 , 2024 | 11:31 AM