Share News

National : ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు పదేళ్ల జైలు

ABN , Publish Date - May 31 , 2024 | 04:54 AM

ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్‌ ఆజం ఖాన్‌కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

National : ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు పదేళ్ల జైలు

  • ఇల్లు ఖాళీ చేయించిన కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు

రాంపూర్‌ (ఉత్తరప్రదేశ్‌)), మే 30: ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్‌ ఆజం ఖాన్‌కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.14 లక్షల జరిమానా కూడా వేసింది. ఎనిమిదేళ్ల క్రితం 2016లో ఆయనపై ఈ కేసు నమోదయింది. ఇంట్లో బలవంతంగా చొరబడి సామాను ధ్వంసం చేయడంతో పాటు, ఇల్లును కూడా కూలగొట్టారంటూ దూంగార్పూర్‌కు చెందిన అబ్రార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆజం ఖాన్‌తో పాటు, అప్పటి మునిసిపల్‌ చైర్మన్‌ అజహర్‌ అహ్మద్‌ ఖాన్‌, మాజీ సర్కిల్‌ ఆఫీసర్‌ ఆలే హసన్‌, మరో వ్యక్తి బర్కత్‌ ఆలీ కాంట్రాక్టర్‌పై కేసులు నమోదయ్యాయి. హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడంతో ఆలే హాసన్‌ కేసును విడిగా విచారణ జరిపారు. ప్రస్తుతం ప్రత్యేక కోర్టు ఆజం ఖాన్‌తో పాటు, మిగిలిన ఇద్దరు అజహర్‌ ఖాన్‌, బర్కత్‌ ఆలీలకు కూడా శిక్ష విధించింది. అజహర్‌ ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా, బర్కత్‌ ఆలీకి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా వేసింది. మరో కేసులో ఆజం ఖాన్‌ ప్రస్తుతం సీతాపూర్‌ జైలులో ఉన్నారు.

Updated Date - May 31 , 2024 | 06:27 AM