Share News

National:ఆస్పత్రిలో మంటలు.. ఆహుతైన చిన్నారులు

ABN , Publish Date - May 27 , 2024 | 05:07 AM

వారంతా రోజుల వయసున్న చిన్నారులు! ఏవేవో సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిగుడ్లు!! కళ్లు తెరిచి ఇంకా లోకాన్ని సరిగ్గా చూడనైనా లేదు.. అర్ధరాత్రి ఆదమరచి నిదురపోతున్న వేళ.. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.

National:ఆస్పత్రిలో మంటలు..  ఆహుతైన చిన్నారులు

  • ఢిల్లీలోని పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

  • ఏడుగురు నవజాత శిశువుల దుర్మరణం

వారంతా రోజుల వయసున్న చిన్నారులు! ఏవేవో సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిగుడ్లు!! కళ్లు తెరిచి ఇంకా లోకాన్ని సరిగ్గా చూడనైనా లేదు.. అర్ధరాత్రి ఆదమరచి నిదురపోతున్న వేళ.. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో శనివారం రాత్రి జరిగిందీ దారుణం.

న్యూఢిల్లీ, మే 26: తొమ్మిది మంది చిన్నారులు సహా 33 మంది ప్రాణాలను బలిగొన్న గుజరాత్‌లో గేమింగ్‌జోన్‌ అగ్రి ప్రమాదం ఘటనను మరువకముందే.. దేశ రాజధానిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు ఢిల్లీ వివేక్‌విహార్‌ ప్రాంతంలోని ‘బేబీ కేర్‌ న్యూబోర్న్‌’ అనే ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చెలరేగిన అగ్నికీలలకు ఏడుగురు నవజాత శిశువులు బలయ్యారు.

తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురు చిన్నారులను వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారిలో కొందరికి స్వల్పగాయాలయినట్టు అధికారులు వివరించారు. మంటల కారణంగా ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్లు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని, ఆస్పత్రి పక్కనున్న భవనాలకు మంటలు విస్తరించి, అవి కూడా కొంతమేర దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందీ ఘోరం. ‘‘శనివారం రాత్రి 11.32 గంటలకు.. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ మాకు ఫోన్‌ వచ్చింది. మంటలు ఆర్పడానికి వెంటనే 21 అగ్నిమాపక శకటాలను పంపాం. అయితే, ఆక్సిజన్‌ సిలిండర్ల కారణంగా 4-5 పేలుళ్లు సంభవించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిలిండర్లు పేలి 50 మీటర్ల దూరంలో పడ్డాయి.


గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలిపి మొత్తం మూడంతస్తులు ఉన్న ఈ భవనంలోని మొదటి అంతస్తులో నవజాత శిశువులను ఉంచి చికిత్సలు చేస్తున్నారు. రెండో అంతస్తును స్టోరేజీ కోసం వినియోగిస్తున్నారు’’ అని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ అతుల్‌ గార్గ్‌ వెల్లడించారు. తమ సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు.

మంటలబారి నుంచి 12 మంది శిశువులను బయటకు తీసుకొచ్చి వేరే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఏడుగురు మరణించారు. వారి భౌతికకాయాలను పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

  • ఎన్‌వోసీ లేదు...

అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఆస్పత్రి యజమాని నవీన్‌ కిచి పరారయ్యారు. పోలీసులు తన ఇంటికి చేరుకోకమునుపే ఆయన రాజస్థాన్‌కు పారిపోయినట్టు తెలిసింది. అయితే, ఆయన జైపూర్‌లో ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

2021లో కూడా నవీన్‌పై ‘నేరపూరిత నిర్లక్ష్యం’ కేసు నమోదైంది. ఈ ఆస్పత్రి ‘ఢిల్లీ నర్సింగ్‌హోమ్‌ యాక్ట్‌’ కింద రిజిస్టర్‌ కాలేదని నాటి దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు జరిమానా విధించగా.. ఆ జరిమానా చెల్లించి, ఆస్పత్రిని యథావిధిగా నడుపుతున్నారు. తాజగా.. ఈ ఆస్పత్రి లైసెన్స్‌ మార్చి 31వ తేదీనే ఎక్స్‌పైర్‌ అయిపోయిందని, అప్పటి నుంచీ లైసెన్స్‌ లేకుండానే నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు.

అసలు ఈ ఆస్పత్రిలోని నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు తగిన అర్హతలు ఉన్నవారు కాదని, సమర్థులు కారని పోలీసులు వెల్లడించారు. వారికి కేవలం బీఎఎంఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ) డిగ్రీ చదివినవారు మాత్రమేనని వివరించారు.


ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగితే ఆర్పడానికి ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లను కూడా ఏర్పాటు చేయలేదని.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ లేదని తెలిపారు. ఇక.. ఈ ఆస్పత్రికి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) లేదని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు.

  • రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..

ఏడుగురు నవజాత శిశువులు ఆస్పత్రిలో అగ్నికీలలకు ఆహుతి కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, కేజ్రీవాల్‌, రాహుల్‌ గాంధీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు ఆదేశించామని.. బాధ్యులైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం కేజ్రీవాల్‌, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ హెచ్చరించారు.

ఈ ప్రమాదంలో తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేజ్రీ ట్వీట్‌ చేశారు. వారందరికీ ఢిల్లీ ఫైర్‌ సేఫ్టీ పథకం కింద ఉచిత చికిత్స అందిస్తామని సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. మరోవైపు.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కూడా ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఒక బృందాన్ని నియమించింది.

  • ఆదుకోకపోగా అడ్డుపడి..

నవజాత శిశువులున్న ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగితే ఆ చిన్నారులను కాపాడాలన్న ఆత్రుతతో పరుగులెత్తిన స్థానికులు కొందరైతే.. మరికొందరు స్థానికులు ఆదుకోకపోగా సహాయచర్యలకు అడ్డం పడ్డారు. అగ్నికీలల్లో చిక్కుకున్న ఆస్పత్రి భవనాన్ని ఫోన్లలో వీడియో తీస్తూ.. అగ్నిమాపక శకటాలకు అడ్డంకిగా మారారు.

దీనికితోడు ఆ వీధిలో కిందికి వేలాడుతున్న విద్యుత్‌ తీగలు కూడా.. అగ్నిమాపక సిబ్బందికి పెనుసవాల్‌గా పరిణమించాయి. ‘‘ఆస్పత్రిలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న భవనంలోని బొటిక్‌కు, ఒక ప్రైవేట్‌ బ్యాంకకు, కళ్లజోళ్ల దుకాణానికి, గృహోపకరణాల దుకాణానికి వ్యాపించాయి. జనం అక్కడ నిలబడి వీడియోలు తీస్తున్నారు’’ అని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ అధికారి ఒకరు వాపోయారు.

Updated Date - May 27 , 2024 | 05:13 AM