Share News

NCP vs NCP: అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:16 PM

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీని తాజా గడువుగా నిర్ణయించింది. ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం వేసిన పిటిషన్‌పై తొలుత జనవరి 31వ తేదీని గడువుగా అత్యున్నత న్యాయస్థానం విధించింది.

NCP vs NCP: అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) గడువు పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీని తాజా గడువుగా నిర్ణయించింది. ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం వేసిన పిటిషన్‌పై తొలుత జనవరి 31వ తేదీని గడువుగా అత్యున్నత న్యాయస్థానం విధించింది. అయితే మరింత గడువు కావాలని స్పీకర్ నార్వేకర్ విజ్ఞప్తి చేయడంతో కోర్టు మరోసారి గడువును పొడిగించింది.


అజిత్ పవార్ వర్గంపై అనర్హత వేటు వేసే విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టు శరద్ పవార్ వర్గం అభ్యర్థించింది. దీనిపై స్పీకర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ, ఎన్పీపీ వ్యవహారాన్ని పరిష్కరించే పనిలోనే స్పీకర్ ఉన్నారని, సమగ్రంగా సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకునేందుకు మరో మూడు వారాలు గడువు పొడిగించాలని కోరారు.


ఎన్సీపీ వెర్సస్ ఎన్సీపీ

శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీపీ నుంచి అజిత్ పవార్ సారథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల ఫిరాయింపులకు పాల్పడ్డారు. బీజేపీతోనూ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనతోనూ పొత్తు పెట్టుకున్నారు. దీంతో అజిత్, 8 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ ఎన్‌సీపీ అనర్హత పిటిషన్లు వేసింది. అయితే మెజారిటీ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నందున తమదే నిజమైన ఎన్‌సీపీ అని అజిత్ పవార్ వాదిస్తున్నారు. ఎన్‌సీపీ పేరు, ఎన్నికల గుర్తు తమదేనంటూ అజిత్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ఎన్నికల కమిషన్ కూడా ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

Updated Date - Jan 29 , 2024 | 02:24 PM