Share News

Sambit Patra: పురీ జగన్నాథుడు మోదీకి భక్తుడు

ABN , Publish Date - May 22 , 2024 | 05:39 AM

‘‘పురీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడు’’ అంటూ నోరుజారిన బీజేపీ నేత, పురీ నుంచి ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సంబిత్‌ పాత్రా చిక్కుల్లో పడ్డారు.

Sambit Patra: పురీ జగన్నాథుడు  మోదీకి భక్తుడు

నోరు జారిన బీజేపీ నేత సంబిత్‌ పాత్రా

భువనేశ్వర్‌, మే 21: ‘‘పురీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడు’’ అంటూ నోరుజారిన బీజేపీ నేత, పురీ నుంచి ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సంబిత్‌ పాత్రా చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. సోమవారం పురీలో ప్రధాని మోదీ రోడ్‌షో సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సంబిత్‌ పాత్రా.. మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య చేశారు. దీనిపై ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీవ్రంగా స్పందించారు.

‘‘ఈ విశ్వానికే జగన్నాథుడు ప్రభువు. అలాంటి మహా ప్రభువును ఓ మానవుడికి భక్తుడు అనడం దేవుణ్ని అవమానించినట్లు’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పురీ అభ్యర్థి జయనారాయణ్‌ పట్నాయక్‌ ఈ అంశంపై పురీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబిత్‌ వ్యాఖ్యకు గాను ప్రధాని నరేంద్ర మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేరా డిమాండ్‌ చేశారు.

బీజేపీ నేతలు తమనుతాము దేవుడికంటే గొప్పగా భావిస్తున్నారని కేజ్రీవాల్‌ విమర్శించారు. దీంతో సంబిత్‌ పాత్రా క్షమాపణలు చెప్పారు. నోరు జారినట్లు వివరణ ఇచ్చుకున్నారు. ఈ తప్పునకు ప్రాయశ్చిత్తంగా మూడ్రోజుల పాటు ఉపవాసం ఉంటానని పేర్కొన్నారు.

Updated Date - May 22 , 2024 | 05:39 AM