Share News

Rahul Gandhi : మీ గొంతునవుతా!

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:00 AM

నీట్‌-2024 రగడ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఫలితాలు విడుదలైనప్పటి నుంచి విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ.. నీట్‌ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.

Rahul Gandhi : మీ గొంతునవుతా!

  • నీట్‌ కుంభకోణంపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తా

  • విద్యార్థులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హామీ

న్యూఢిల్లీ, జూన్‌ 9: నీట్‌-2024 రగడ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఫలితాలు విడుదలైనప్పటి నుంచి విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ.. నీట్‌ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ అంశంపై పార్లమెంటులో విద్యార్థుల గొంతుకగా నిలిచి మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తానని స్పష్టం చేశారు. ‘

‘నరేంద్ర మోదీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు. నీట్‌ కుంభకోణం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. ఒకే పరీక్ష కేంద్రంలో ఆరుగురు గరిష్ఠ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. చాలామందికి సాంకేతికంగా సాధ్యంకాని మార్కులు వచ్చాయి. ఇంత జరిగినా పేపర్‌ లీకేజీ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. దీనిపై చట్టం చేయడం ద్వారా పేపర్‌ లీకేజీల సమస్యల నుంచి విద్యార్థులను విముక్తులను చేస్తామని మా మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చాం.

ఈ రోజు దేశంలోని విద్యార్థులందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను. పార్లమెంటులో నేను మీ గొంతుగా ఉంటాను. మీ భవిష్యత్తును ప్రభావితం చేసే సమస్యలను బలంగా లేవనెత్తుతా’’ అని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు ఎక్స్‌ (ట్విటర్‌)లో రాహుల్‌ ట్వీట్‌ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ నాశనం చేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా ఆరోపించారు. నీట్‌-2024 అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి కె సంజయ్‌కు లేఖరాశానని ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలకు ఇతర పార్టీలు కూడా గొంతు కలిపాయి. నీట్‌ కుంభకోణంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి. నీట్‌ వివాదం నేపథ్యంలో.. కేంద్రం ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 10 , 2024 | 05:00 AM