Share News

Prajwal : 34 రోజుల తర్వాత బెంగళూరుకు ప్రజ్వల్‌

ABN , Publish Date - May 31 , 2024 | 04:48 AM

మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ..

Prajwal : 34 రోజుల తర్వాత బెంగళూరుకు ప్రజ్వల్‌

ఎయిర్‌ పోర్టులో దిగగానే అరెస్టు చేసే అవకాశం

బెంగళూరు, మే 30(ఆంధ్రజ్యోతి): మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ.. జర్మనీ నుంచి ఎట్టకేలకు వెనుదిరిగారు. ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు లుఫ్తాన్సా ఎయిర్‌వేస్‌ ఎల్‌హెచ్‌ 764 విమానంలో బయలుదేరారు. ఈ విమానం సుమారు ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది.

గురువారం రాత్రి ఒంటి గంట తర్వాత బెంగళూరు ఎయిర్‌పోర్టుకు ప్రజ్వల్‌ చేరుకోనున్నారని సమాచారం. ప్రజ్వల్‌ను బెంగళూరు విమానాశ్రయంలోనే సిట్‌ అధికారులు అరెస్టు చేయనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి సిట్‌ అధికారుల బృందం ఎయిర్‌పోర్టులోనే మకాం వేసింది.

ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చే మార్గం వద్దే ప్రజ్వల్‌ను అరెస్టు చేసి, అక్కడి నుంచి సిట్‌ కార్యాలయానికి తరలించనున్నారు. శుక్రవారం సాయంత్రంలోగా కోర్టు ముందు హాజరుపరచి, ప్రజ్వల్‌ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

హాసన్‌ ఎంపీగా కొనసాగుతున్న ప్రజ్వల్‌, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏప్రిల్‌ 26న పోలింగ్‌ ముగిసిన తరువాత ప్రజ్వల్‌ రాసలీల పెన్‌డ్రైవ్‌లు బయటకు రావడంతో.. అదే రోజు అర్ధరాత్రి తర్వాత ఆయన జర్మనీకి వెళ్లారు. ఆయనపై ఇప్పటిఏ సిట్‌ అధికారులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత బ్లూకార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.

Updated Date - May 31 , 2024 | 06:29 AM