Share News

Prajwal Revanna: ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్న ప్రజ్వల్

ABN , Publish Date - May 01 , 2024 | 04:31 PM

లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండైన జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణ ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మే 3-4 తేదీల మధ్యలో ఆయన స్వదేశానికి తిరిగి వస్తారని చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై సిట్ దర్యాప్తు జరుపుతోంది.

Prajwal  Revanna: ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి  రానున్న ప్రజ్వల్

బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండైన జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మే 3-4 తేదీల మధ్యలో ఆయన స్వదేశానికి తిరిగి వస్తారని చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై సిట్ (SIT) దర్యాప్తును చేపట్టడం, తక్షణం తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆయనకు సమన్లు పంపిన నేపథ్యంలో రేవణ్ణ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. రేవణ్ణ తండ్రి, హోలెనరసిపూర్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు కూడా సిట్ సమన్లు పంపింది.

Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య


దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడంలో రేవణ్ణ విఫలమయ్యారంటూ ఆయనను పరారీలో ఉన్న వ్యక్తిగా సిట్ ఇప్పటికే ప్రకటించింది. హసన్ జిల్లాలో గత వారంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినట్టుగా చెబుతున్న రాసలీలల వీడియోలు వెలుగుచూడటం రాజకీయ దుమారం సృష్టించింది. దర్యాప్తు బాధ్యతను చేపట్టిన సిట్ ప్రాథమిక విచారణలో కీలక ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. బెంగళూరు, హసన్‌లో ఉన్న రేవణ్ణ నివాసాల్లో మొబైల్ ఫోన్‌తో రికార్డు చేసిన ఒక పెన్‌డ్రైవ్‌ను అధికారులు కనుగొన్నారు. ఇందులో 2,976 అశ్లీల వీడియోను ఉన్నట్టు చెబుతున్నారు. రేవణ్ణ నివాసంలో 2019-2020 మధ్య కాలంలో పనిచేసిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రేవణ్ణ, ఆయన తండ్రిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజు ఏప్రిల్ 27న రేవణ్ణ జర్మనీకి వెళ్లారు. విచారణకు పిలిస్తే తన కుమారుడు తిరిగి వస్తారని హెచ్‌డీ రేవణ్ణ మీడియాకు తెలిపారు. కాగా, ప్రజ్వల్‌పై ఆరోపణలు వచ్చినప్పటికీ బీజేపీ-జేడీఎస్‌లు హసన్ లోక్‌సభకు ఆయనను తమ అభ్యర్థిగా నిలబెట్టాయి. అయితే వివాదం ముదరడంతో పార్టీ నుంచి ప్రజ్వల్‌ను జేడీఎస్ సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన లైంగిక వైధింపుల ఆరోపణలపై షోకాజ్ నోటీసు ఇచ్చింది.

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 04:35 PM