Share News

PM Modi: ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం

ABN , Publish Date - May 01 , 2024 | 04:24 AM

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం చేతగాని ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో నకిలీ వీడియోలను సర్క్యులేట్‌ చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు.

PM Modi: ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం

  • ఆ దుకాణాన్ని ఇక మూసేయాల్సిందే

  • ఈ ఎన్నికలు దేశ గౌరవానికి సంబంధించినవి

  • ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు

  • కూటమి వస్తే ప్రధాని పీఠంపై ఏడాదికి ఒకరు

  • సమస్యలు-కాంగ్రెస్‌ కవల పిల్లలు మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ

ధారాశివ్‌, లాతూర్‌(మహారాష్ట్ర), ఏప్రిల్‌ 30: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం చేతగాని ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో నకిలీ వీడియోలను సర్క్యులేట్‌ చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ‘‘ఏఐతో నకిలీ వీడియోలు తయారు చేసి వారి ప్రేమ దుకాణంలో అమ్ముతున్నారు.’’ అని ఎద్దేవా చేశారు. ఆ అబద్ధాల దుకాణాన్ని ఇక మూతవేయాలి... అని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని ఈమేరకు వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు దేశ ఆత్మగౌరవానికి సంబంధించినవని చెప్పారు. ‘‘బలహీన, ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలు బలమైన దేశాన్ని నిర్మించగలవా’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు ప్రధాని పదవి చేపట్టాలని నిర్ణయానికి వచ్చారని తెలిపారు. ఆ విధానంతో దేశానికి మంచి జరగదన్నారు. కాంగ్రెస్‌, సమస్యలు కవల పిల్లల్లాంటివని ఎద్దేవా చేశారు.


పేదరికం తప్ప... ఆ పార్టీ దేశానికి ఇచ్చిందేమీ లేదన్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసమే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగంలో చేర్చారని, వాటిని ఎవరు తొలగించలేరన్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించి వాటిని తమ ఓటుబ్యాంకుకు (ముస్లింలకు) ఇవ్వాలనేది కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల ఉద్దేశమని ప్రధాని మోదీ ఆరోపించారు.


మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం అయినప్పటికీ, ఇండియా కూటమి విచ్ఛిన్నకరమైన, వివక్షాపూరితమైన అజెండాను కలిగి ఉన్నదని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించాలని పిలుపునిస్తూ ఎన్‌డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులకు మోదీ వ్యక్తిగత లేఖలు రాశారు. తన పదేళ్ల హయాంలో దేశంలో అన్ని రంగాలు మెరుగయ్యాయని, అయినప్పటికీ ఇంకా చెయ్యాల్సింది చాలా ఉందని మోదీ పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికలు కీలకమన్నారు.

Updated Date - May 01 , 2024 | 04:24 AM