Share News

Prime Minister Modi : రాహుల్‌ది మావోయిస్టు భాష!

ABN , Publish Date - May 20 , 2024 | 03:32 AM

కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు.

Prime Minister Modi : రాహుల్‌ది మావోయిస్టు భాష!

  • కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు

  • ఏ పారిశ్రామికవేత్త అయినా 50సార్లు ఆలోచిస్తాడు: మోదీ

జంషెడ్‌పూర్‌, పురూలియా, మే 19: కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు. పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచుకోవడానికే ఆయన ఆ భాష వాడుతున్నారని ఆరోపించారు. ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడితో.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హిందూ సాధుసంతులపై విమర్శలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు.

ఆదివారం ఆయన ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌, పశ్చిమబెంగాల్‌లోని పురూలియా, బిష్ణుపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఝార్ఖండ్‌లో తాము నక్సల్స్‌ వెన్ను విరిస్తే.. డబ్బు దోచుకునే బాధ్యతను కాంగ్రెస్‌, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా తీసుకున్నాయని దుయ్యబట్టారు. పీకల్లోతు అవినీతిలో మునిగిపోయిన ఆ రెండు పార్టీలూ దేశాభివృద్ధి కోసం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లోని పురూలియా, బిష్ణుపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ..


రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘకు చెందిన కొందరు సాధుసన్యాసులు ఢిల్లీలోని బీజేపీ నేతల ప్రభావంతో తృణమూల్‌ కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

సేవకు, నైతికతకు పేరెన్నికగన్న ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ విషయంలో టీఎంసీ హద్దులు దాటి, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని, మమత బహిరంగంగానే ఆ సంస్థలను బెదిరిస్తూ హెచ్చరికలు జారీచేస్తున్నారని ఆరోపించారు. జూన్‌ 4న తాము మళ్లీ అధికారపగ్గాలు చేపట్టాక.. అవినీతిపరులందరినీ శాశ్వతంగా జైలుకు పంపుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌, టీఎంసీ పార్టీలు అవినీతి విషయంలో ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘టీఎంసీ, కాంగ్రెస్‌, వామపక్షాలు.. వేర్వేరు పార్టీలుగా కనిపించినా, ఆ పార్టీలు చేసిన పాపాలు ఒకటే. అందుకే ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి’’ అన్నారు.

Updated Date - May 20 , 2024 | 03:34 AM