Share News

INDIA bloc Maha Rally: ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: ఉద్ధవ్

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:43 PM

బీజేపీ నేతలను ''దోపిడీదారులు''గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అభివర్ణించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

INDIA bloc Maha Rally: ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: ఉద్ధవ్

న్యూఢిల్లీ: బీజేపీ నేతలను ''దోపిడీదారులు''(Thugs)గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) అభివర్ణించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం (one party one person's government) దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. 'ఇండియా' కూటమి నేతలతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం కోసం తామిక్కడ సభ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇక్కడ సమావేశమయ్యామని చెప్పారు. ఎవరినైతే బీజేపీ ఒకప్పుడు అవినీతిపరులని చెప్పిందో వారినే ఇప్పుడు ఆ పార్టీ అక్కున చేర్చుకుంటోందని తప్పుపట్టారు.


''అవినీతిపరులగా బీజేపీ గతంలో ఆరోపించిన వారినే ఇప్పుడు వాషింగ్ మిషన్‌లో శుభ్రం చేసి క్లీన్ చిట్ ఇస్తోంది. బీజేపీలో చేరమంటూ వారిని ఆహ్వానిస్తోంది. అవినీతిపరులతో నిండిపోయిన ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది?" అని థాకరే ప్రశ్నించారు. ఇప్పుడు వాళ్లు (బీజేపీ) 400 సీట్లకు పైగా గెలుస్తామంటూ కలలు కంటున్నారని, ఒక పార్టీ, ఒకే వ్యక్తి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఇదే తగిన తరుణమని ఆయన అన్నారు.


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్టు, ఇతర అంశాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు ఈ మహాసభలో సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తదితరులు ఈ మహాసభలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 07:55 PM