Share News

Nitin Gadkari: కాంగ్రెస్‌కు గడ్కరి లీగల్ నోటీసు.. మూడు రోజుల్లో క్షమాపణకు డిమాండ్

ABN , Publish Date - Mar 02 , 2024 | 02:34 PM

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత జైరామ్ రమేష్‌ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లీగల్ నోటీసు పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Nitin Gadkari: కాంగ్రెస్‌కు గడ్కరి లీగల్ నోటీసు.. మూడు రోజుల్లో క్షమాపణకు డిమాండ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), సీనియర్ నేత జైరామ్ రమేష్‌ (Jairam Ramesh)కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) లీగల్ నోటీసు (Legal notice) పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. గందరగోళం, సంచలనం సృష్టించడంతో పాటు బీజేపీ నేతగా తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతోనే ఈ క్లిప్‌ను షేర్ చేశారని గడ్కరి ఆరోపించారు. ఇంటర్వ్యూలో తాను చెప్పిన అంశాలకున్న ప్రాధాన్యతను వక్రీకరించి, పార్టీలో విభేదాల సృష్టికి ప్రయత్నించినట్టు తప్పుపట్టారు. గడ్కరి తరఫున ఆయన న్యాయవాది బాలేందు శేఖర్ ఈ నోటీసు పంపారు.


నోటీసులో ఏముంది?

''నా క్లయింట్ ఇంటర్వ్యూను వక్రీకరించి, కొన్ని ఎంపిక చేసిన క్లిపింగ్స్‌తో వీడియోను పోస్ట్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. నా క్లయింట్ భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డైనమిక్ పాలనకు అద్దం పడుతున్న క్యాబినెట్‌లో మంత్రిగా గడ్కరి ఉన్నారు. ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన తరచు హైలైట్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం 'ది లల్లాన్‌టాప్'లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. బీజేపీలో భాగంగా, దశాబ్దాలు అవిశ్రాంత సేవలతో దేశ ప్రజల మన్ననలను నా క్లయింట్ అందుకొంటున్నారు. 2024 మార్చి 1వ తేదీన మీరు (INC) పోస్ట్ చేసిన వీడియో, అందులోని వక్రీకరణలను చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. 19 సెక్షన్ల వీడియో కేవలం స్వార్ధ ప్రయోజనాలను ఆశించి, గందరగోళం, సంచలనం సృష్టించేందుకు, పబ్లిక్‌లో గడ్కరి ఇమేజ్‌ను దెబ్బతీసేందు ఉద్దేశించినట్టుగా ఉంది. మోదీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికలు వెళ్తున్న వేళ బీజేపీలో విభేదాలు సృష్టించేందుకు ఉద్దేశించినట్టుగా కనిపిస్తోంది'' అని బాలేందు శేఖర్ ఆ నోటీసులో పేర్కొన్నారు.


24 గంటల్లోగా...

నోటీసు అందిన 24 గంటల్లోగా కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌ నుంచి వీడియోను తొలగించాలని, మూడు రోజుల్లోగా గడ్కరికి క్షమాపణ చెప్పాలని ఆ నోటీసు డిమాండ్ చేసింది. అలా చేయని పక్షంలో తన క్లయింట్ సివిల్, క్రిమినల్ చర్యలకు వెళ్లక తప్పదని పేర్కొంది.

Updated Date - Mar 02 , 2024 | 03:08 PM