PM Modi: నా జీవితం తెరిచిన పుస్తకం.. ప్రజలే నా కుటుంబం
ABN , Publish Date - Mar 04 , 2024 | 02:50 PM
ఆశ్రిత పక్షపాతం, అవినీతికి సంబంధించి విపక్ష 'ఇండియా' కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజానీకం తన కుటుంబమని, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో మోదీ సోమవారంనాడు ప్రసంగించారు.
ఆదిలాబాద్: ఆశ్రిత పక్షపాతం, అవినీతికి సంబంధించి విపక్ష 'ఇండియా' (INDIA) కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజానీకం తన కుటుంబమని, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో మోదీ సోమవారంనాడు ప్రసంగిస్తూ, 'ఇండి' కూటమిలో అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు వేళ్లూనుకున్నాయని, అందువల్లనే నెర్వస్‌తో ఉన్నారని విమర్శించారు. పరివార్‌వాద్ గురించి తాను ప్రశ్నించినప్పుడల్లా వారు మోదీకి కుటుంబ లేదంటూ మాట్లాడుతుంటారని కౌంటర్ ఇచ్చారు.
''నా జీవితం తెరిచిన పుస్తకం. 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. ఈరోజు కోట్లాది మంది ఆడ కూతుళ్లు, తల్లులు, సోదరీమణులు నా కుటుంబ సభ్యుల్లో ఉన్నారు. ప్రతి పేద వ్యక్తి నా కుటుంబం వ్యక్తే. ఎవరూ లేరనుకున్న వారికి మోదీ ఉన్నాడు. మోదీ వారి మనిషి'' అని అన్నారు. ప్రజలందరికీ తన గురించి తెలుసునని, ప్రతి కదలికలను వారు గమినిస్తుంటారని చెప్పారు. ఒక్కోసారి అర్ధరాత్రి వరకూ పని చేస్తున్నప్పుడు ఆ వార్త బయటకు వస్తుందని, అంతగా శ్రమపడవద్దని, కొంత విశ్రాంతి తీసుకోమని కొందరు తనకు లేఖలు రాస్తుంటారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.
''మేరా భారత్, మేరా పరివార్ అనే భావనతో నేను జీవిస్తుంటాను. నేను మీకోసం జీవిస్తున్నాను. మీ కోసం పోరాడుతున్నాను. మీ కోసం పోరాడుతూనే ఉంటాను. దృఢ సంకల్పంతో మీ కలలు పండిస్తాను'' అని మోదీ భరోసా ఇచ్చారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావిస్తూ, ఇప్పటి వరకూ వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్‌కు ఇప్పటి వరకూ 15 లక్షల మందికి పైగా సూచనలు చేశారని, ఈ ప్లాన్‌లో 3,75,000 యాక్టివ్ పార్టిసిపెంట్లు ఉన్నారని చెప్పారు. వికసిత్ భారత్ విజన్ కోసం ఇంతవరకూ 3,000కు పైగా సమావేశాలు జరిగాయన్నారు. గత 15 రోజుల్లో 2 ఐఐటీలు, 1 ఐఐఐటీ, 3 ఐఐఎంలు, 1 ఐఐఎస్, 5 ఎయిమ్స్‌లు ప్రాంరభించామన్నారు. రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్ స్కీమ్ ప్రారంభించామని చెప్పారు. 18,000 కోపరేటివ్‌లను కంప్యూటరైజ్ చేశామని తెలిపారు. 2,000 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. గత 15 రోజుల్లోనే 1.5 లక్షల కోట్ల విలువైన ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామన్నారు. ఈ జాబితా ఇంతటితో ఆగలేదని, ఆత్మనిర్భర్ భారత్‌కు ఈ 15 రోజలు మరింత బలాన్ని ఇచ్చాయన్నారు. సోమవారం ఉదయం ఆదిలాబాద్‌లో రూ.56,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో విద్యుత్, రైలు, రోడ్ రంగంలోని పలు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.