Share News

New Odisha CM: ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:13 PM

ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. దీనికి ముందు శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా మాఝీ ఎన్నికైనట్టు అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా హాజరైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.

New Odisha CM: ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi)ని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. దీనికి ముందు శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా మాఝీ ఎన్నికైనట్టు అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా హాజరైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. దీంతో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది. ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రి క్రెడిట్ మోహన్ చరణ్ మాఝీకి దక్కింది. ఈ ఎన్నికల్లో కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేడీ అభ్యర్థి మీనా మాఝీని 87,815 ఓట్ల ఆధిక్యంతో మోహన్ చరణ్ మాఝీ ఓడించారు. 2000, 2004లో బీజేపీ, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేసినప్పుటికీ, ఈసారి బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.


కాగా, మాఝీ కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్దన్ సింగ్ డియో, ప్రవటి పరిధా ఉండనున్నారు. 147 మంది సభ్యులున్న ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ ఈ విజయాన్ని సాధించింది.


12న ప్రమాణస్వీకారం

కాగా, ఒడిశాలో తొలి బీజేపీ ప్రభుత్వం ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనుంది. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో భారీఎత్తున జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. బీజేడీ అధ్యక్షుడు, అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామికి బీజేపీ తొలి ఆహ్వాన పత్రికను పంపింది.


ఎవరీ మోహన్ చరణ్ మాఝీ?

గిరిజన నేతగా మంచి పేరున్న మాఝీ 2000లో కియోంజర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2000 నుంచి 2009 వరకూ రెండు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో తిరిగి ఇదే నియోజవవర్గం నుంచి గెలుపొందారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన చేసి ప్రజాసేవలు, సంస్థాగత నైపుణ్యం ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

Updated Date - Jun 11 , 2024 | 07:16 PM