Share News

BJP : పాతవారికి అవే శాఖలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:54 AM

పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్‌ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్‌ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ (రక్షణ), నిర్మలా సీతారామన్‌ (ఆర్థికం), జైశంకర్‌ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.

BJP : పాతవారికి అవే శాఖలు

మంత్రుల శాఖల్లో ప్రయోగాలకు వెళ్లని మోదీ.. షా, రాజ్‌నాథ్‌, నిర్మల,

గడ్కరీకి గత బాధ్యతలే

 • శాఖల్లో ప్రయోగాలు చేయని మోదీ

 • షా, రాజ్‌నాథ్‌, నిర్మల, గడ్కరీ, జైశంకర్‌,

 • గోయల్‌కు మళ్లీ పాత బాధ్యతలే

 • ఐదేళ్ల తర్వాత వైద్య శాఖలోకి జేపీ నడ్డా

 • శివరాజ్‌, ఖట్టర్‌కు వ్యవసాయం, విద్యుత్తు

 • జ్యోతిరాదిత్య సింధియా నుంచి

 • రామ్మోహన్‌కు పౌర విమానయానం

 • కీలకమైనవి సొంత పార్టీ వారికే

 • విదేశాంగం జై శంకర్‌కే.. వాణిజ్యం గోయల్‌కే..!

న్యూఢిల్లీ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్‌ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్‌ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ (రక్షణ), నిర్మలా సీతారామన్‌ (ఆర్థికం), జైశంకర్‌ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మోదీ తొలి విడతలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు.

పార్టీ బాధ్యతల రీత్యా రెండో విడతలో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రసాయనాలు, ఫర్టిలైజర్స్‌తో కలిపి వైద్య శాఖ ఇచ్చారు. రైల్వేను అశ్విని వైష్ణవ్‌ వద్దే ఉంచుతూ.. ఐటీ, సమాచార, ప్రసార, ఎలకా్ట్రనిక్స్‌ శాఖలను జోడించారు. జ్యోతిరాదిత్య సింథియాను మాత్రం పౌర విమానయానం నుంచి టెలికాంకు మార్చి.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధినీ కట్టబెట్టారు. భూపేంద్ర యాదవ్‌ మరోసారి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను చూడనున్నారు.

జల్‌శక్తి శాఖను సీఆర్‌ పాటిల్‌కు కేటాయించారు. బీజేపీకే చెందిన హర్దీప్‌సింగ్‌ పురీ, మన్‌సుఖ్‌ మాండవియాకూ మంచి శాఖలే లభించాయి. ఒడిసాకు చెందిన జుయల్‌ ఓరమ్‌కు గిరిజన వ్యవహారాలను కేటాయించారు. కాగా, మిత్రపక్షాల్లో టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్‌నాయుడికి పౌర విమానయానం, జేడీయూ నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్‌, మత్స్య, పశు సంవర్ధకం దక్కాయి.


జేడీయూ ఎంపీ కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ బాధ్యతలు ఇచ్చారు. ఈ మూడు పార్టీలు గత ఏడాదిలోనే ఎన్డీఏలో చేరాయి. కాగా, హిందుస్థానీ ఆవామీ మోర్చా (హెచ్‌ఎఎం)కు చెందిన జీతన్‌రామ్‌ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దక్కాయి. లోక్‌జనశక్తి నేత చిరాగ్‌ పాసవాన్‌కు ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు అప్పగించారు. స్మృతీ ఇరానీ చూసిన మహిళా సంక్షేమం అన్నపూర్ణాదేవికి లభించింది. జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్డీ)కి స్వతంత్ర హోదాలో నైపుణ్యాభివృద్ధి శాఖను కేటాయించారు.

 • మాజీ సీఎంలందరికీ చోటు

రాజ్‌నాథ్‌ (యూపీ), కుమారస్వామి (కర్ణాటక), మాంఝీ (బిహార్‌), శర్బానంద సోనోవాల్‌ (అసోం)తో పాటు ఇటీవల మాజీలైన సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌)కు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఖట్టర్‌ (హరియాణ)కు విద్యుత్తు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల వంటి ప్రధానమైన శాఖలు లభించడం గమనార్హం. కాగా, గతంలో ఎర్త్‌ సైన్సెస్‌, ఆహార శుద్ధి శాఖలు చూసిన కిరెన్‌ రిజిజుకు ఈసారి పార్లమెంటరీ వ్యవహారాలతో ప్రమోషన్‌ లభించింది. గతంతో ఈ శాఖను చూసిన ప్రహ్లాద్‌జోషిని ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖకు మార్చారు.

కాగా, స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారిలో డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ (కశ్మీర్‌) అత్యంత ముఖ్యమైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రజా ఫిర్యాదులు తదితర శాఖలను పర్యవేక్షించాల్సి ఉంది. అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (న్యాయ).. మరో కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగానూ కర్తవ్యం నెరవేర్చాలి ఉంటుంది.

 • ఎన్నికలున్నచోట..

ఈ ఏడాది మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. వీటిలో పదవుల కేటాయింపుపై మహారాష్ట్ర అధికార భాగస్వామ్య పార్టీలు శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఖట్టర్‌ను కేంద్రంలోకి తీసుకొచ్చి హరియాణలో ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అన్నపూర్ణాదేవికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జార్ఖండ్‌కూ ప్రాధాన్య కల్పించారు.

Updated Date - Jun 11 , 2024 | 03:54 AM