Share News

Rahul Gandhi: భయంతో మోదీ వణుకుతున్నారు! స్టేజీపైనే కన్నీళ్లు కూడా పెడతారేమో

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:18 AM

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Rahul Gandhi: భయంతో మోదీ వణుకుతున్నారు!   స్టేజీపైనే కన్నీళ్లు కూడా పెడతారేమో

  • ప్రధానిపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

  • తాము అధికారంలోకి వస్తే..‘అగ్నివీర్‌’ రద్దు, జీఎస్టీలో

    మార్పులు చేస్తామని హామీ

బెంగళూరు/బళ్లారి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఇటీవల మోదీ ప్రసంగాలను గమనిస్తే ఆయన భయంతో వణుకుతున్నట్లుందని, రాబోయే రోజుల్లో ఆయన స్టేజీపైనే కన్నీళ్లు కూడా పెడతారేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోని విజయపురలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పారు. మోదీ తన మాటలతో వాటినుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.


‘కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్‌ అంటారు. కొన్నిసార్లు పళ్లేలు కొట్టి శబ్దం చేయమంటారు. ఇంకోసారి మీ మొబైల్‌ ఫోన్లలో టార్చ్‌లైట్‌ ఆన్‌ చేయమని అడుగుతారు’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మాత్రమే నిరుద్యోగాన్ని రూపుమాపగలదని, ధరల పెరుగుదలను అరికట్టగలదని, ప్రజలకు తమ వంతు వాటా ఇవ్వగలదని ఆయన స్పష్టం చేశారు. మోదీ హయాంలో నిరుద్యోగం కొవిడ్‌ వ్యాపించినట్లు పెరిగిపోయిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామని యవతకు రాహుల్‌ హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక పార్టీ, ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు.

శ్రీమంతుల సొమ్మును రైతులకు పంచుతాం

ప్రధాని మోదీ శ్రీమంతులకు ఇచ్చిన సొమ్మును రైతులకు పంచడమే తమ పథకమని రాహుల్‌ అన్నారు. గడిచిన పదేళ్లలో బిలియనీర్లకు మాత్రమే మోదీ మద్దతు ఇచ్చి పోషించారని విమర్శించారు. అదానీకి పెద్ద ప్రాజెక్టులు కట్టబెట్టారని, పేదలకు ఏమిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీలతో పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు.


బీజేపీ చెంబు పార్టీ: రాహుల్‌

బీజేపీ అంటే భారతీయ చెంబు పార్టీ అని, కరువు సాయంగా కర్ణాటకకు రూ.18వేల కోట్లు రావాల్సి ఉండగా, ఆ రాష్ట్రానికి ఖాళీ చెంబు మాత్రమే దక్కిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బళ్లారి మున్సిపల్‌ కాలేజీ మైదానంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘దేశ సంపదను తమకు అనుకూలమైన 22మంది సంపన్నులకు బీజేపీ పంచింది.

పూర్వం రాజులు వారి సామ్రాజ్యాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలించారు. అలాంటి వారినుంచి దేశాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్‌ పోరాడు తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే దేశంలో పేదల జాబితాను తయారు చేసి, ప్రతి ఒక్కరి ఖాతాలో ఏడాదికి రూ.లక్ష వేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు.

Updated Date - Apr 27 , 2024 | 03:19 AM