Share News

Manmohan Singh: ‘నవ సత్యాగ్రహ’ రెండో రోజు సభ రద్దు

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:32 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతితో కాంగ్రెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో విషాదం అలముకుంది. కర్ణాటకలోని బెళగావిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకులందరూ తరలివచ్చారు.

Manmohan Singh: ‘నవ సత్యాగ్రహ’ రెండో రోజు సభ రద్దు

బెళగావి నుంచి హుటాహుటిన ఢిల్లీకి ఖర్గే, రాహుల్‌

బెంగళూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతితో కాంగ్రెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో విషాదం అలముకుంది. కర్ణాటకలోని బెళగావిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకులందరూ తరలివచ్చారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, ఎంపీలు బెళగావికి చేరుకున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ‘నవ సత్యాగ్రహ ’ సభ నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సహా ప్రముఖ కాంగ్రెస్‌ నేతలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిరోజైన గురువారం ఉదయం నుంచి పలు కార్యక్రమాలు జరిగాయి.


సాయంత్రం నవ సత్యాగ్రహ పేరిట కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ నిర్వహించి.. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. సభ ముగిశాక అగ్రనాయకులంతా రాత్రి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత మన్మోహన్‌ ఇక లేరనేవిషాద సమాచారం అందడంతో నాయకులంతా విషాదంలో మునిగిపోయారు. మన్మోహన్‌సింగ్‌ కుటుంబ సభ్యులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఆ తర్వాత హుటాహుటిన ఇద్దరు అగ్రనేతలు ఢిల్లీకి బయల్దేరారు. బెళగావిలోని సువర్ణసౌధ ప్రాంగణంలో శుక్రవారం గాంధీ విగ్రహావిష్కరణ, బహిరంగసభ జరగాల్సి ఉంది. మన్మోహన్‌ సింగ్‌ మృతితో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

Updated Date - Dec 27 , 2024 | 05:32 AM