Share News

Karnataka to Ayodhya: కర్ణాటక నుంచి అయోధ్యకు 11 ప్రత్యేక రైళ్లు.. గోవా నుంచి మరో రెండు..

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:51 AM

అయోధ్యలో నిర్మించిన చారిత్రాత్మక రామాలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం రాష్ట్రం నుంచి 11 ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి.

Karnataka to Ayodhya: కర్ణాటక నుంచి అయోధ్యకు 11 ప్రత్యేక రైళ్లు.. గోవా నుంచి మరో రెండు..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో నిర్మించిన చారిత్రాత్మక రామాలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం రాష్ట్రం నుంచి 11 ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీరామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠ ఈనెల 22న జరగనుంది. బాలరామ (రామలల్లా) విగ్రహాలకు పూజలు చేసి రామమందిరాన్ని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం నుంచి 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటక - గోవా నుంచి రెండు రైళ్లు బయల్దేరనుండగా, కర్ణాటక నుంచి అయోధ్య(Karnataka to Ayodhya)కు నేరుగా మిగిలిన 9 రైళ్లు సంచరించనున్నాయి. ఈనెల 31 తర్వాత ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ మినహా నేరుగా టికెట్లు విక్రయించే వెసులుబాటు ఉండదు. అయోధ్యలో రైళ్లు నిలిపేందుకు అనుగుణంగా ఏ రాష్ట్రం నుంచి ఎన్ని రైళ్లు సంచరించాలో నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక నుంచి 11 రైళ్లకు అవకాశం లభించనుంది.

బీదర్‌ నుంచి అయోధ్యకు సైకిల్‌ యాత్ర

రామమందిర ప్రారంభాన్ని తిలకించేందుకు వినూత్నంగా ప్రయాణించాలని భావించిన బీదర్‌ జిల్లా యువకుల బృందం సైకిళ్లపై బయల్దేరింది. డిసెంబరు 25న బయల్దేరిన ఈ బృందం జనవరి 22 నాటికి అయోధ్యకు చేరనుంది. రాముడిపై భక్తితో బీదర్‌లోని చిద్రి రోడ్డుకు చెందిన హనుమాన్‌ సేవా యువబృందం ఈ యాత్రకు బయలుదేరింది. వీరు 1300 కిలోమీటర్ల దూరాన్ని సైకిళ్లపై ప్రయాణించనున్నారు. బయల్దేరినవారిలో అజయ్‌శర్మ, విజయ్‌శర్మ, ఉదయ్‌శర్మ, భవనేశ్‌, అంబరీశ్‌, జగదీశ్‌, విష్ణు, అభిషేక్‌, సాయినాథ్‌ ఉన్నారు. వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడుని దర్శించుకుని అయోధ్యకు వెళతారు. ప్రస్తుతం వీరు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం అమర్‌పఠాన్‌ ప్రాంతంలో వెళుతున్నారు. ఇప్పటికే 850 కిలోమీటర్ల మేరకు సైకిల్‌ సవారీ చేశారు. ఈ మేరకు అజయ్‌శర్మ, విజయ్‌శర్మ బుధవారం బీదర్‌కు చెందిన మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రయాణం సజావుగా సాగుతోందని, అయితే చలి, మంచు ఎక్కువగా ఉన్నందున కొంత ఇబ్బందికరంగా ఉందని, అయినా ప్రయాణం సాగుతోందని తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 11:51 AM