Share News

Lok Sabha Elections: ఇది సైద్ధాంతిక పోరాటం, ఎన్నికల తర్వాతే పీఎం అభ్యర్థి ఎంపిక: రాహుల్

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:27 PM

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న శక్తులకు, వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించిన శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే 2024 లోక్‌సభ ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాతే 'ఇండియా' కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు.

Lok Sabha Elections: ఇది సైద్ధాంతిక పోరాటం, ఎన్నికల తర్వాతే పీఎం అభ్యర్థి ఎంపిక: రాహుల్

న్యూఢిల్లీ: రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న శక్తులకు, వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించిన శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే 2024 లోక్‌సభ ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఎన్నికల తర్వాతే 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు.


శుక్రవారంనాడిక్కడ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం రాహల్ మాట్లాడుతూ, మీడియా ప్రచారం చేస్తున్నట్టు కాకుండా చాలా పోటీపోటీగా ఈ ఎన్నికలు ఉండనున్నాయని, ఎన్నికల్లో తాము ('ఇండియా' కూటమి) గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2004లోనూ ''ఇండియా షైనింగ్'' అంటూ వాళ్లు (బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే) ప్రచారం చేశారని, అయితే అప్పటి ఎన్నికల్లో ఎవరు గెలిచారో అందరికీ తెలిసిందేనని, బీజేపీ ఓటమి చవిచూస్తే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సైద్ధాంతిక పరమైన ఎన్నికలు గానే 'ఇండియా' కూటమి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోందని, ఎన్నికల తర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు.


మేనిఫెస్టోలో కీలకాంశాలు...

కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పలు కీలకాంశాలు చోటుచేసుకున్నాయి. 'పాంచ్ న్యాయ్' సూత్రం ఆధారంగా ఒక్కోన్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం 25 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైతు న్యాయం, మహిళా న్యాయం, యువత న్యాయం, కార్మిక న్యాయం, భాగస్వామ్య న్యాయం వంటి ఐదు న్యాయ్‌లు ఇందులో ఉన్నాయి. పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు, కులగణన నిర్వహించడం, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని రద్దు చేయడం, రైతులకు కనీస మద్దతు ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, కార్మికులకు ఆరోగ్యంపై హక్కుల కల్పన వంటి హామీలు ఇందులో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19తో మొదలై ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 03:47 PM