Free Liquor: పోలీస్ ఎస్కార్ట్‌తో ఉచిత లిక్కర్ పంచిన బీజేపీ ఎంపీ అనుచరగణం
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:32 PM
కర్ణాటక బీజేపీ ఎంపీ కె.సుధాకర్ అనుచరులు స్థానికులకు ఉచిత మద్యం పంచారు. ఈ ఈవెంట్‌కు పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుధాకర్ గెలవడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహించిన ఈవెంట్ ఇది.

న్యూఢిల్లీ: మద్యం బాటిళ్ల కోసం పొడవాటి క్యూలు, తమ వంతు కోసం జనం ఎదురుచూపులు, ఈ మొత్తం తతంగానికి పోలీసులు సెక్యూరిటీ కల్పించడం. ఇదేదో మద్యంపై నిషేధం ఎత్తేసిన తర్వాత కనిపించే దృశ్యం అనుకుంటే పొరపాటే. ఎంపీని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన మద్దతుదారులు నిర్వహించిన ఈవెంట్. కర్ణాటక బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి కె.సుధాకర్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రక్షా రామయ్యపై 1.6 లక్షల ఓట్లతో గెలిచారు. దీంతో ఆయన మద్దతుదారులు స్థానికులకు "ఉచిత మందు'' పార్టీ ఆఫర్ చేశారు. ఈ ఈవెంట్ పర్మిషన్ కోసం స్థానిక పోలీసులకు ఎంపీ సుధాకర్ లేఖ రాశారని, ఈవెంట్‌లో మందు, విందు ఏర్పాటు చేసినందున పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారని చెబుతున్నారు.
నడ్డానే సమాధానం ఇవ్వాలి: డీకే
కాగా, బీజేపీ ఎంపీ ఇచ్చిన 'ఉచిత మందు' పార్టీ రాజకీయరంగు పులుముకుంది. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. ఎవరో స్థానిక నేతలు కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానే స్వయంగా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ సంస్కృతే ఇదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటుందా అని ఆయనను అడిగినప్పుడు, అది తర్వాత విషయమని, ముందు ఆ పార్టీ (బీజేపీ) సమాధానం ఇవ్వాలని డీకే అన్నారు.
Sandeshkhali case: సీబీఐ దర్యాప్తును సవాలు చేసిన బెంగాల్ సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదరు
బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..
కాగా, ఎంపీని గెలిపించినందుకు కృతజ్ఞతగా జనాలకు ఉచితంగా మద్యం పంచడంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సీఎన్ అశ్వథ్ నారాయణ వ్యాఖ్యానిస్తూ., విషయం సమగ్రంగా తెలుసుకోకుండా ఏమీ మాట్లాడలేమన్నారు. అయితే ఇందుకు సంబంధించిన సిస్టమ్ ఏదైనా ఉంటే బాధ్యులను గుర్తించాలని, జరిగినదాంట్లో తప్పు ఉందని ప్రభుత్వానికి అనిపిస్తే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
Read Latest National News and Telugu News