Share News

Former CM: దేశమంతటా మోదీ హవా.. దక్షిణాదిలో ఈసారి ఆశ్చర్యకర ఫలితాలు

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:33 PM

దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ(Narendra Modi) హవా బలంగా వీస్తోందని, ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు.

Former CM: దేశమంతటా మోదీ హవా.. దక్షిణాదిలో ఈసారి ఆశ్చర్యకర ఫలితాలు

- మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ(Narendra Modi) హవా బలంగా వీస్తోందని, ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేఏఎస్‌ మాజీ ఉన్నతాధికారి ఆర్‌ రద్రయ్య పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను బొమ్మై సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశప్రజలంతా మోదీ వైపు, బీజేపీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. తమ చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తున్నందుకు మోదీపై ప్రజల్లో నమ్మకం బాగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో 2019 కంటే అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎంపీ స్థానాల సంఖ్య గతంలో కంటే బాగా పెరగనున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకులన్నీ బీటలు వారుతున్నాయని, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్ పై ఉన్న భ్రమలు క్రమేపీ తొలగిపోతున్నాయని అన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చుచేయాల్సిన రూ.11 వేల కోట్లను గ్యారంటీకు మళ్లించి ద్రోహం చేసిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. దళితుల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ అని, బీజేపీలో మాత్రమే సామాన్య కార్యకర్తకు కూడా అత్యున్నత స్థానాన్ని అలంకరించే అవకాశం లభిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత ఆర్‌. అశోక్‌తో పాటు లోక్‌సభ సభ్యుడు ఎస్‌.మునిస్వామి, రాయచూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శివరాజ్‌పాటిల్‌, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మహేంద్ర కౌతాళ, ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

pandu1.1.jpg

ఇండియా కూటమి ఛిద్రం

లోక్‌సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమి ఛిద్రం కానుందని, ఎన్నికల అనంతరం పూర్తిగా అదృశ్యం కానుందని బొమ్మై జోస్యం చెప్పారు. నగరంలో బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా కూటమి నుంచి ఇప్పటికే సమాజ్‌వాదిపార్టీ వైదొలిగిందని, తాజాగా మమతా బెనర్జీ కూడా గుడ్‌బై చెప్పేశారని అన్నారు. కాంగ్రెస్‌ వ్యవహార తీరును తట్టుకోలేక కూటమి నుంచి ఒక్కొక్కరే మెల్లగా జారుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలో శరద్‌ పవార్‌, నితీ్‌షకుమార్‌ కూడా కూటమికి గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోందన్నారు. భక్తి అనే కళ్లజోడు ధరించి చూస్తే శ్రీరామచంద్రుడు సర్వత్రా కనిపిస్తాడని, అప్పుడే మోక్షం సాక్షాత్కరిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి బొమ్మై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Jan 25 , 2024 | 12:33 PM