Share News

Shyam Saran Negi : భారత మొదటి ఓటర్ శ్యామ్ శరణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ABN , Publish Date - Mar 14 , 2024 | 06:28 PM

రానున్న కొన్ని రోజుల్లో దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకు ముందు నుంచే ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

 Shyam Saran Negi : భారత మొదటి ఓటర్ శ్యామ్ శరణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

రానున్న కొన్ని రోజుల్లో దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకు ముందు నుంచే ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఓటరు జాబితా తయారు చేసే పనిలో తలమునకలయ్యారు. అయితే స్వతంత్ర భారత తొలి ఓటరు పేరు శ్యామ్ సరణ్ నేగి.1951 అక్టోబర్ 25న తొలిసారిగా ఓటు వేసి స్వతంత్ర భారతదేశపు తొలి ఓటరుగా నిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి 1952లో జరిగాయి. ఇందులో ఆయన తొలి ఓటు వేశారు.

స్కూల్‌లో టీచర్‌గా..

శ్యామ్ శరణ్ నేగి జూలై 1917లో కిన్నౌర్‌లోని కల్పాలో జన్మించారు. ఐదో తరగతి వరకు స్థానికంగా చదువుకున్న ఆయన ఉన్నత విద్య కోసం రాంపూర్ వెళ్లారు. అక్కడ తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు. వయసు ఎక్కువగా ఉండటంతో ఆయనకు పదో తరగతిలో ప్రవేశం లభించలేదు. ఆ తర్వాత శ్యామ్ శరణ్ నేగి 1940 నుండి 1946 వరకు అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డుగా పనిచేసి, కల్పా లోయర్‌ మిడిల్‌ స్కూల్‌లో టీచర్‌ గా పని చేశారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలు కిన్నౌర్‌లో ఐదు నెలల ముందుగా 1951 సెప్టెంబర్ లో జరిగాయి. ఆ సమయంలో కిన్నౌర్ లో విపరీతమైన హిమపాతం కురవడంతో ఎన్నికలను ముందుకు జరిపారు.


మొదటి ఓటు..

ఎన్నికలు జరిగిన సమయంలో శ్యామ్ శరణ్ నేగి కిన్నౌర్‌లోని మూరాంగ్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఉదయం ఓటు వేసి విధులకు వెళ్లేందుకు అనుమతి కోరారు. దీంతో ఉదయాన్నే పోలింగ్ స్టేషన్ కు చేరుకుని మొదటగా ఓటు వేసేందుకు అనుమతి పొందారు. ఈ విధంగా శ్యామ్ శరణ్ నేగి స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరుగా చరిత్రకెక్కారు.

చివరి ఓటు..

శ్యామ్ శరణ్ నేగి 5 నవంబర్ 2022న 106 ఏళ్ల వయసులో మరణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 2, 2022న తన మరణానికి రెండు రోజుల ముందు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఇంటి నుంచి చివరి ఓటు వేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 06:28 PM