Share News

Cambodia: విశాఖ వ్యక్తి చొరవతో.. కంబోడియాలో భారతీయులు సేఫ్..

ABN , Publish Date - May 23 , 2024 | 01:30 PM

విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను కాపాడటంలో భారత విదేశాంగ శాఖ మరో విజయం సాధించింది. సైబర్ నేరాల బారిన పడి కంబోడియాలో చిక్కుకున్న ఇండియన్స్‌ను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది.

Cambodia: విశాఖ వ్యక్తి చొరవతో.. కంబోడియాలో భారతీయులు సేఫ్..
indian Embassy in cambodia

విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను కాపాడటంలో భారత విదేశాంగ శాఖ మరో విజయం సాధించింది. సైబర్ నేరాల బారిన పడి కంబోడియాలో చిక్కుకున్న ఇండియన్స్‌ను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలోని మరో 60 మందిని భారత రాయబార కార్యాలయ అధికారులు కాపాడారు. దీంతో కంబోడియా నుంచి ఇప్పటివరకు సురక్షితంగా బయటపడ్డ వారి సంఖ్య 420కి చేరుకుంది. కంబోడియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆపరేషన్ కంబోడియాను సక్సెస్ చేశారు. సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో వందలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని అక్కడి నుంచి కాపాడటంలో ఇండియన్ ఎంబసీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బుధవారం 360 మందిని కాపాడిన అధికారులు ఇవాళ మరో 60 మందిని పోలీసుల నుంచి విడిపించారు. వీరిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారున్నారు.


భారతీయులతో సమావేశం..

కంబోడియాలోని ఇండియన్ కమ్యూనిటీతో అక్కడి భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయులను మనమే రక్షించుకోవాలన్నారు. ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వడం, వారి భద్రత, శ్రేయస్సు కోసం ఇండియన్ ఎంబసీ కార్యాలయం పనిచేస్తుందన్నారు. భారతీయులను కాపాడటంలో సహకరించిన కంబోడియా అధికారులకు దేవయాని ధన్యవాదాలు తెలిపారు.


ఉద్యోగాల పేరుతో..

విదేశీ ఉద్యోగాల పేరిట ఎన్నో ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఈక్రమంలో సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేయడంతో బాధితులు జైలు పాలయ్యారు. ఉద్యోగాల పేరుతో తీసుకెళ్లి తమను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు కొందరు బాధితులు విశాఖపట్టణం పోలీసులకు వాట్సప్‌తో పాటు ఎక్స్ ద్వారా వీడియో పోస్టు చేశారు. విషయాన్ని కేంద్రంలోని విదేశాంగ శాఖ అధికారులకు చేరవేయడంతో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి వారిని కాపాడారు.


విశాఖ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో

విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్ కుమార్ సామాజిక మాద్యమాల్లో ప్రకటనలు ఇచ్చాడు. వాటిని నమ్మిన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది నిరుద్యోగులు రాజేష్‌కు లక్షా 50 వేల రూపాయిలు చెల్లించారు. డబ్బులు కట్టిన నిరుద్యోగులను బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కంబోడియా పంపించారు. అక్కడ మరోగ్యాంగ్ రిసీవ్ చేసుకుని కంబోడియాలోని పాయిపేట్ వీసా సెంటర్‌కు తరలించారు. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ ముఠా చైనా గ్యాంగ్‌కు వీరిని విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా రూ.2,500 యుఎస్ డాలర్ల నుంచి రూ.4వేల యుఎస్ డాలర్లకు చైనా కంపెనీలకు ఈ నిరుద్యోగులను విక్రయించారు. అక్కడ పనిచేసి చైనా గ్యాంగ్ నుంచి తప్పించుకున్న విశాఖపట్టణానికి చెందిన శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశారు. మోసపు ప్రకటనలతో యువతను విదేశాలకు తరలిస్తున్న ఘటనలపై విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పాక్‌కు.. రాహుల్‌, అఖిలేశ్‌ జై

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 23 , 2024 | 01:30 PM