Share News

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:23 AM

ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం

ఢిల్లీ: ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

తాజాగా కమ్యూనిస్టు పార్టీ సైతం కూటమికి షాక్ ఇచ్చింది. జార్ఖండ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) కూటమి నుండి వైదొలిగి, రాబోయే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు గానూ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర పాఠక్ తెలిపారు. జార్ఖండ్ నుంచి పార్లమెంట్ లోక్ సభలో సీపీఐకి ప్రాతినిధ్యం లేదు.

అందుకే ఒంటరి పోటీ..

ఇండియా కూటమి నుంచి బయటకి వస్తున్నట్లు ప్రకటించిన మహేంద్ర దానికి గల కారణాలు వెల్లడించారు. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి జాప్యం చేస్తున్నందున ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు. "బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్‌తో కూడిన మహాగట్బంధన్ సీట్ల పంపకంపై ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదు. కాబట్టి మేం ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాం" అని ఆయన తెలిపారు.

రాంచీలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠక్ చెప్పారు. రాంచీ, హజారీబాగ్, కోడెర్మా, చత్రా, పాలము, గిరిదిహ్, దుమ్కా, జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపబోతుందని వివరించారు. మార్చి 16 తరువాత పేర్లు ప్రకటిస్తామని వివరించారు.


అయితే జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం నేతలు సీపీఐ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. సీపీఐ కేంద్ర నాయకత్వం ఇండియా కూటమిలో సీట్ల గురించి చర్చలు జరుపుతుండగా.. రాష్ట్ర పార్టీ నేతలు ఒంటరిగా బరిలోకి దిగడం ఆ పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అంటున్నారు. జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి 11, ఏజేఎస్‌యూ పార్టీకి ఒకటి, జేఎంఎంకు ఒకటి, కాంగ్రెస్‌ ఒక స్థానం చొప్పున లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాయి. అయితే, కాంగ్రెస్‌కి చెందిన ఏకైక ఎంపీ గీతా కోరా ఇటీవల బీజేపీలోకి చేరారు. 81 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో JMMకి 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 17 మంది, RJDకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 11:23 AM