Share News

Kharge : హిందూ-ముస్లింల మధ్య మోదీ చిచ్చు

ABN , Publish Date - May 22 , 2024 | 05:33 AM

హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా నిత్యం వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ప్రజా జీవితం నుంచి వైదొలగాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ చేశారు.

Kharge : హిందూ-ముస్లింల మధ్య మోదీ చిచ్చు

ఆయన ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలి: ఖర్గే

జగ్‌ధారి(హరియాణ)/న్యూఢిల్లీ, మే 21: హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా నిత్యం వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ప్రజా జీవితం నుంచి వైదొలగాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న మోదీ ఉద్దేశాలు స్వచ్ఛంగా లేవని మంగళవారం పీటీఐ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్‌ గెలిస్తే ప్రజల ఆస్తులు లాగేసుకుంటుందని, ముస్లింలకు 15 శాతం బడ్జెట్‌ అంటూ ప్రధాని మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలతో ఆయనే సమాజంలో విభజన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘ఓ వైపు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు హిందూ-ముస్లింల గురించి మాట్లాడితే తాను ప్రజా జీవితంలో ఉండటానికి అర్హుడిని కాదని మోదీ చెప్తుంటారు’ అని ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నది బీజేపీయేనని ఆరోపించారు. మోదీ వన్‌ మ్యాన్‌ షో చేయాలని అనుకుంటున్నారని, ఒక్క నాయకుడే ఈ దేశం మొత్తాన్ని నడపగలడనేది ఆయన ఆలోచనగా పేర్కొన్నారు.

పేదలకు సాయం చేయడం, ఏ సామాజిక వర్గానికైనా అన్యాయం జరగకుండా ఆపడం బుజ్జగింపు రాజకీయం కాబోదని ఖర్గే స్పష్టం చేశారు. మోదీ అబద్ధాలకోరని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై అబద్ధాలు చెబుతున్నారని ఖర్గే ఆరోపించారు. గత పదేళ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తదుపరి ప్రధాని ఎవరనేది ఎన్నికల తర్వాత మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయిస్తామని ఖర్గే చెప్పారు.

Updated Date - May 22 , 2024 | 05:33 AM