Share News

Cancer Treatment: రూ.100 మాత్రతో క్యాన్సర్‌ వ్యాప్తికి చెక్‌

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:09 AM

క్యాన్సర్‌ బాధితులకు శుభవార్త! కీమో, రేడియేషన్‌ వంటి చికిత్సలతో తగ్గిపోయిన క్యాన్సర్‌.. మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్రను ముంబైలోని ప్రతిష్ఠాత్మక

Cancer Treatment: రూ.100 మాత్రతో క్యాన్సర్‌ వ్యాప్తికి చెక్‌

ముంబై, ఫిబ్రవరి 28: క్యాన్సర్‌ (Cancer) బాధితులకు శుభవార్త! కీమో, రేడియేషన్‌ వంటి చికిత్సలతో తగ్గిపోయిన క్యాన్సర్‌.. మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్రను ముంబైలోని ప్రతిష్ఠాత్మక క్యాన్సర్‌ పరిశోధన సంస్థ ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్ఆర్‌)’ శాస్త్రజ్ఞులు రూపొందించారు. వారి దశాబ్దకాల పరిశోధనల ఫలితం ఈ ట్యాబ్లెట్‌. దీని గురించి టాటా మెమోరియల్‌ ఆస్పత్రిలోని సీనియర్‌ క్యాన్సర్‌ సర్జన్‌, ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్‌ రాజేంద్ర బడ్వే వివరించారు.

ప్రయోగాల్లో భాగంగా తాము కొన్ని ఎలుకల శరీరాల్లోకి.. మానవ క్యాన్సర్‌ కణాలను చొప్పించామని, ఆ ఎలుకల్లో క్యాన్సర్‌ కణితులు ఏర్పడ్డాక వాటిని రేడియేషన్‌, కీమో థెరపీలతో, సర్జరీ ద్వారా తొలగించామని తెలిపారు. ‘‘ఆ చికిత్సలతో చనిపోయిన క్యాన్సర్‌ కణాలు.. ‘సెల్‌ ఫ్రీ క్రోమాటిన్‌ పార్టికల్స్‌’ అనే చిన్నచిన్న తునకలుగా మారిపోవడం మేం గమనించాం. ఆ పార్టికల్స్‌ రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు ప్రయాణిస్తాయి. అవి అక్కడ ఆరోగ్యవంతమైన కణాల్లోకి ప్రవేశించి వాటిని క్యాన్సర్‌ కణాలుగా మారుస్తాయి’’ అని ఆయన వివరించారు.

కొన్ని సీఎ్‌ఫసీహెచ్‌పీఎ్‌సలు ఆరోగ్యవంతమైన క్రోమోజోములతో కలిసిపోయి కొత్త కణితులకు కారణమవుతాయని వెల్లడించారు. ‘‘ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ఎలుకలకు మేము రెజర్వెట్రాల్‌, కాపర్‌ (ఆర్‌+సీయూ)తో కూడిన ప్రో-ఆక్సిడెంట్‌ ట్యాబ్లెట్లను ఇచ్చి చూశాం. ఈ ట్యాబ్లెట్లు కడుపులో ఆక్సిజన్‌ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆక్సిజన్‌ రాడికల్స్‌ కూడా రక్తప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశించి.. ఎక్కడ సెల్‌ ఫ్రీ క్రోమాటిన్‌ పార్టికల్స్‌ కనిపించినా వాటిని నాశనం చేస్తాయి. తద్వారా మెటాస్టాసిస్‌’’ అని తెలిపారు. ఈ ట్యాబ్లెట్‌ క్యాన్సర్‌ తిరగబెట్టకుండా కాపాడడంలో 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని.. కీమోథెరపీ దుష్ప్రభావాల నుంచి కూడా 50శాతం దాకా రక్షణ ఇస్తుందని చెప్పారు. ఈ ట్యాబ్లెట్‌ విశిష్టత గురించి తెలిపే ప్రజెంటేషన్‌కు వారు.. ‘మ్యాజిక్‌ ఆఫ్‌ ఆర్‌+సీయూ’ అని పేరు పెట్టడం విశేషం. జూన్‌ జూలై నుంచి ఈ టాబ్లెట్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, సామాన్యులకు భారం లేకుండా రూ.100కే అందుబాటులోకి వస్తుందని డాక్టర్‌ రాజేంద్ర వెల్లడించారు.

Updated Date - Feb 29 , 2024 | 06:58 AM