Share News

Droupadi Murmu: వికసిత భారతాన్ని నిర్మిస్తాం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి తొలి ప్రసంగం..

ABN , Publish Date - Jan 31 , 2024 | 11:18 AM

వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

Droupadi Murmu: వికసిత భారతాన్ని నిర్మిస్తాం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి తొలి ప్రసంగం..

ఢిల్లీ: వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

తమ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో చూస్తుందని.. దేశాభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. నూతన పార్లమెంటు భవనంలో తనది తొలి ప్రసంగమని చెప్పారు. భారత సంస్కృతి సభ్యత ఎంతో చైతన్యవంతమైనదని గుర్తు చేశారు.


"దేశంలో లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. నారీశక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించడంతో చట్ట సభల్లోవారి ప్రాతినిధ్యం 33 శాతం పెరుగుతుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి 107 పతకాలు, పారా క్రీడల్లో 111 పతకాలను భారత్ సాధించింది. తొలిసారి నమో భారత్ రైలును ఆవిష్కరించాం. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న అన్ని ఆటంకాలు అధిగమించి.. ప్రపంచమే మెచ్చేలా రాములవారి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. దీంతో ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారమైంది.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. తెలంగాణలో సమ్మక్క - సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం. దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. అందుకు తగినట్లు టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చాం. రక్షణ, అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించుకున్నాం. భగవాన్ బిర్సాముండా జన్మదిన్నాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకుంటున్నాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. సూర్యుడిపై ప్రయోగాల్లో భాగంగా ఆదిత్య ఎల్ - 1 మిషన్ విజయవంతం అయింది. జీ 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం" అని ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు.

"దేశ అభివృద్ధి యువశక్తి, నారీ శక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం. సౌర విద్యుదుత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా. ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలో భారత్ ఒకటిగా ఉంది. రూ.4 లక్షల కోట్లు వెచ్చించి దేశమంతటా తాగునీటి వసతి కల్పిస్తున్నాం. 10 కోట్లకుపైగా ఉజ్వల కనెక్షన్లు, కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించాం. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా మన బలాలుగా మారాయి. రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం. సామాన్యులపై భారం పడకుండా ట్యాక్సుల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. 2 కోట్లకుపైగా మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. 4.10 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయమందిస్తున్నాం. కరోనా, యుద్ధాల ప్రభావం ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడ్డాం. రష్యా - ఉక్రెయిన్, ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధాల వేళ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం. పదేళ్లలో ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం. ఆయా ప్రాంతాలకు శుద్ధ జలాలు అందిస్తున్నాం. ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం" అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2024 | 12:19 PM