Share News

BJP state president: తేల్చిచెప్పేశారు.. జేడీఎస్‏తో మా పొత్తు కొనసాగుతుంది..

ABN , Publish Date - Mar 20 , 2024 | 01:13 PM

జేడీఎస్‏తో తమ పొత్తు కొనసాగుతుందని, చిన్నచిన్న అపోహలు ఉంటే వాటిని సరిదిద్దుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) ప్రకటించారు.

BJP state president: తేల్చిచెప్పేశారు.. జేడీఎస్‏తో మా పొత్తు కొనసాగుతుంది..

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర

బెంగళూరు: జేడీఎస్‏తో తమ పొత్తు కొనసాగుతుందని, చిన్నచిన్న అపోహలు ఉంటే వాటిని సరిదిద్దుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) ప్రకటించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు సమయంలో చిన్న చిన్న అపోహలు రావడం సహజమన్నారు. పరస్పరం చర్చల అనంతరం కథ సుఖాంతమైందన్నారు. జేడీఎస్‌ నేతల గౌరవ మర్యాదలకు భంగం రాని రీతిలో తమ పార్టీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కోలారు నియోజకవర్గం విషయంలో స్థానిక బీజేపీ కార్యకర్తల వల్ల కొంత జాప్యం జరిగినమాట నిజమే అన్నారు. స్థానిక నేతలతో చర్చించి పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జేడీఎస్ కు సహకరించాలని కోరామన్నారు. తాను స్వయంగా మాజీ ప్రధాని దేవెగౌడతోనూ, మాజీ సీఎం కుమారస్వామితోనూ చర్చించానని వివరించారు. టిక్కెట్ల విషయంలో మాజీ సీఎం సదానందగౌడ, మాజీ డీసీఎం కేఎస్‌ ఈశ్వరప్ప ఒకింత అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని, వీరెవ్వరూ కాంగ్రెస్ లో చేరే ప్రశ్నే లేదన్నారు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు.

పొత్తు పదిలం: కుమారస్వామి

రాష్ట్ర ప్రయోజనాలకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాచార వినిమయంలో జరిగిన గందరగోళం వల్లే కొద్దిగా సమస్య ఏర్పడిందని, ఇప్పుడు అంతా సర్దుకుందన్నారు. మూడు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేపీ, జేడీఎస్‌ కలసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాయన్నారు. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు.

దేవెగౌడ అల్లుడు బీజేపీ టికెట్‌ తీసుకోవడం ఆత్మహత్యా సదృశ్యమే: డీకే

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అల్లుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ బీజేపీ టిక్కెట్‌పై పోటీ నిర్ణయం తీసుకున్నప్పుడే జేడీఎస్‏లో తొలి ఆత్మహత్యాయత్నం జరిగిందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) వ్యాఖ్యానించారు. రెండు, మూడు నియోజకవర్గాల కోసం పార్టీ సిద్ధాంతాలను, లక్షలాదిమంది కార్యకర్తల ఆకాంక్షలను ఫణంగా పెట్టిన జేడీఎస్‌ అగ్రనేతల తీరుపై కార్యకర్తల్లో ఆవేశం వెల్లువెత్తుతోందన్నారు.

Updated Date - Mar 20 , 2024 | 01:13 PM