Ayodhya: అయోధ్యలో రామ మందిరం.. ఇకపై ప్రతిరోజూ ఈ సమయంలో బంద్
ABN , Publish Date - Feb 16 , 2024 | 10:11 PM
అయోధ్యలో రామమందిరం దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
అయోధ్య(Ayodhya)లో రామ మందిరం(Ram mandir) దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు మధ్యాహ్నం ఒక గంట(12:30 నుంచి 1:30 వరకు) మాత్రమే రామాలయం తలుపులు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ప్రస్తుతం శ్రీరాంలాలా ఐదేళ్ల బాలరాముని రూపంలో ఉన్నారు. అందువల్ల బాల దేవతకు కొంత విశ్రాంతినిచ్చేందుకు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించిందని ఆచార్య సత్యేంద్ర దాస్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రతిష్ఠాపన కార్యక్రమం తరువాత రాంలాలా దర్శన సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు రెండు గంటల పాటు ఆలయ తలుపులు మూసివేసేవారు.
రామజన్మభూమికి ప్రధాన అర్చకులుగా చిన్నప్పటి నుంచి అయోధ్యలో ఉంటున్న ఆచార్య సత్యేంద్ర దాస్ ఉన్నారు. ఆయన సుమారు 32 ఏళ్లుగా రాంలాలా ఆలయాన్ని పూజిస్తున్నారు. 1992లో బాబ్రీ విధ్వంసానికి ముందు కూడా ఆచార్య జీ తన జీవితమంతా రాంలాలాకే అంకితం చేశారు. బాబ్రీ కూల్చివేత సమయంలో కూడా ఆయన గుడి కోసం పోరాడారు. అతని పోరాటం, రాముడిపై ఉన్న విశ్వాసం కారణంగా అతను ఇప్పటికీ రామ మందిరానికి ప్రధాన పూజారిగా పూజలు చేస్తున్నారు.