Share News

ఈ 8 మంది.. లోక్‌సభ ఎన్నికల్లో చూపంతా వీరి వైపే..

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:20 AM

కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు..! మరికొందరేమో తెరవెనుక కీలక వ్యూహకర్తలు..!

ఈ 8 మంది.. లోక్‌సభ ఎన్నికల్లో చూపంతా వీరి వైపే..
Lok Sabha Elections

న్యూఢిల్లీ, మార్చి 18: కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు..! మరికొందరేమో తెరవెనుక కీలక వ్యూహకర్తలు..! ఇంకొందరేమో పట్టువదలని విక్రమార్కులు..! దేశం ఎదుర్కొననున్న అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో(Loksabha Elections) అందరి దృష్టి వీరిపైనే..! వచ్చే ఎన్నికలు ఈ ఎనిమిది మంది అగ్రనేతల చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు.

తనదైన ముద్ర వేయాలని: మద్దతుదారులకు ఓ అసాధారణ శక్తి అయితే.. వ్యతిరేకులకు కరుడుగట్టిన వర్గ విభజనవాది ప్రధాని మోదీ (74)(PM Modi). హ్యాట్రిక్‌ కొట్టడమే కాదు.. సొంతంగానే 370 సీట్లు గెలుస్తాం.. మా కూటమికి 400 స్థానాలు ఖాయం అంటూ.. మూడో టర్మ్‌ తొలి వంద రోజు పాలనకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని చెబుతూ గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి వెయ్యేళ్లు గుర్తుండేలా పాలన అందిస్తామని చెబుతున్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రచారం జరిగేలా చూస్తూ, జాతీయవాదానికి ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌లా చూపుతూ వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. బీజేపీనే కాదు.. యావత్‌ విపక్ష ప్రచారమూ మోదీ చుట్టూనే తిరుగుతుందనడంలో సందేహం లేదు.

గత ఓటమికి బదులు..: జాతీయ స్థాయిలో బీజేపీకి సవాల్‌ విసురుతున్న ఏకైక నాయకుడు రాహుల్‌ గాంధీ(53). సరిగ్గా 20 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఈ కాంగ్రెస్‌ అగ్రనేత.. ఈసారి అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 2019 ఎన్నికల్లో మోదీ చేతిలో ఓటమికి గురయ్యారు. లోక్‌సభ సభ్యత్వంపై వేటు, మోదీ పేరును కించపరిచినందుకు కేసులు, బంగ్లాను ఖాళీ చేయాల్సి రావడం వ్యక్తిగతంగానూ రాహుల్‌ను ఇబ్బందిపెట్టాయి. వీటికి గట్టిగా బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు దక్కింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, మణిపూర్‌ నుంచి ముంబైకి చేపట్టిన భారత్‌ జోడో యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన రాహుల్‌.. కాంగ్రెస్‌ విధానాలు, సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో సఫలీకృతమయ్యారు. న్యాయ్‌ గ్యారెంటీలకు తోడు రైతులు, మహిళలకు లబ్ధి చేకూర్చే హామీలతో ప్రజలను ఆకట్టుకున్నారు.

రగులుతున్న అగ్గి బరాటా: రాష్ట్రంలో నేరుగా, ఇండియా కూటమితో జాతీయంగా బీజేపీతో తలపడుతున్నారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(69). ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తూనే.. కాంగ్రె్‌సకు సీట్లు ఇవ్వం పొమ్మని తేల్చిచెప్పారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి. 42 ఎంపీ సీట్లకూ పోటీ చేస్తామని ప్రకటించారు. దీనివెనుక బీజేపీని ఓడించాలన్న ఆమె కసి స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో బీజేపీ బెంగాల్‌లో 18 సీట్లు నెగ్గి మమతను కలవరపెట్టింది. ఢీ అంటే ఢీ అని తలపడుతున్న ఈ రెండు పార్టీల మధ్య బెంగాల్‌ ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం.

కేజ్రీ కథ ఎంతవరకో?: మద్యం విధానం కుంభకోణంలో ఈడీ వేటాడుతున్నా.. బీజేపీ, మోదీకి తలొంచడం లేదు ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (55). వచ్చే ఎన్నికల్లో ఈయన ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. 2019లో ఒక్క సీటుకే పరిమితమైన ఆప్‌.. ఆ స్కోరును పంజాబ్‌ అండతో ఈసారి డబుల్‌ డిజిట్‌ దాటించే అవకాశం ఉంది. బోన్‌సగా ఢిల్లీలో కొన్ని స్థానాలు నెగ్గొచ్చు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ప్రభావం చూపినా.. ఎంపీ సీట్లు గెలుస్తాందో, లేదో చూడాలి.

బిహార్‌ తేజం: జేడీయూ నీతీశ్‌ చేతిలో మోసపోయిన బిహార్‌ యువ నేత, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌ (34).. దానికి ప్రతీకారాన్ని తీర్చుకునే చాన్సు వచ్చింది. ప్రభావవంతమైన ముస్లిం-యాదవ్‌ (ఎంవై) సమీకరణంతో కాంగ్రె్‌సను కలుపుకొని వెళ్తూ బీజేపీ-జేడీయూను తేజస్వీ ఢీకొట్టనున్నారు. 40 సీట్లున్న రాష్ట్రంలో ఇతర వర్గాలను ఆకట్టుకోలేకపోవడం ఆయన బలహీనత. అయోధ్య రామ మందిర నిర్మాణం బిహార్‌లోనూ ప్రభావం చూపుతున్న వేళ.. ఇండియా కూటమి కీలక నేతగా ఉన్న లాలూ కుమారుడికి సవాల్‌ ఎదురవనుంది.

అఖిలేశ్‌ ఏం చేస్తారో?: దిగ్గజ నాయకుడైన తండ్రి ములాయం సింగ్‌ లేకుండా తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (50). లోక్‌సభ సీట్ల (80) పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీపై బీజేపీ చాలా పట్టుదలగా ఉంటుందనడంలో సందేహం లేదు. దీనికితోడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఘనత ఉండనే ఉంది. అలాంటిచోట కాంగ్రె్‌సకు 17 సీట్లు ఇచ్చి, 63 సీట్లలో బరిలో దిగుతోంది సమాజ్‌వాదీ పార్టీ. తొలుత కాస్త బెట్టు చేసినా.. అఖిలేశ్‌ పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోయారు. యూపీలోనూ ముస్లిం-యాదవ్‌ (ఎంవై) సమ్మేళనం కీలకం.

పోయిన పవర్‌ను వెదుక్కొంటూ

జీవితంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మరాఠా యోధుడు శరద్‌ పవార్‌. 83 ఏళ్ల వయసులో, రాజకీయ జీవిత చరమాంకంలో కఠిన సవాలుకు సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన ఎన్సీపీని అన్న కొడుకు అజిత్‌ పవార్‌ సొంతం చేసుకున్నారు. పెద్ద పవార్‌ ఎన్సీపీ (శరత్‌చంద్ర పవార్‌)లో కొద్ది మంది నేతలే మిగిలారు. అయినా, తన వ్యూహాలతో వెన్నుచూపకుండా పోరాడుతున్నారు. తనలాగే బీజేపీ కారణంగా పార్టీని కోల్పోయిన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ థాక్రేతో కలిసి మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)ని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

తమిళనాడు అడ్డుగోడ డీఎంకే

దేశంలో అత్యంత ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్న ఏకైక నాయకుడు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌ (71) అని చెప్పొచ్చు. వీరి ప్రధాన విపక్షం ఏఐఏడీఎంకే చూపంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. బీజేపీ తమిళనాట తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. మోదీ, షా పలుసార్లు పర్యటించినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీతో బంధాన్ని కొనసాగిస్తూ తమిళనాడులో బీజేపీని నిరోధిస్తున్నారు స్టాలిన్‌. 39 సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో డీఎంకే కూటమి 38 గెలుచుకుంది. ‘ఇండియా’కు ఓ విధంగా స్టాలిన్‌ పెద్ద అండ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 09:52 AM