Share News

NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ పవార్‌దే నిజమైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 08:24 PM

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తుపై తలెత్తిన వివాదంపై భారత ఎన్నికల సంఘం అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ వర్గానికి అనుకూలంగా మంగళవారంనాడు తీర్పునిచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీనే నిజమైన ఎన్‌సీపీ అని ప్రకటించింది. ఆ పార్టీ పేరు, గుర్తు ఆయన వర్గానికే కేటాయించింది.

NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ పవార్‌దే నిజమైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ

న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరు, గుర్తుపై తలెత్తిన వివాదంపై భారత ఎన్నికల సంఘం (ECI) అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ వర్గానికి అనుకూలంగా మంగళవారంనాడు తీర్పునిచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీనే నిజమైన ఎన్‌సీపీ అని ప్రకటించింది. ఆ పార్టీ పేరు, గుర్తు ఆయన వర్గానికే కేటాయించింది. ఈసీ నిర్ణయంతో లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరుగనున్న నేపథ్యంలో శరద్ పవార్ వర్గానికి గట్టి దెబ్బ తగినట్టయింది. గత ఆరు నెలల్లో 10 సార్లు విచారణ జరిపిన అనంతరం ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.


గత ఏడాది జూలైలో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీలో చీలిక తలెత్తింది. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అధికార మహారాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనతో పాటు ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యేల సంఖ్యా బలం కలిగిన తమదే నిజమైన ఎన్‌సీపీ అని అజిత్ పవార్ క్లెయిమ్ చేశారు. ఎన్‌సీపీ చీలకను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఇరువర్గాలను తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఎట్టకేలకు అజిత్ పవార్ వర్గానిదే నిజమైన ఎన్సీపీ అని ప్రకటిస్తూ, పార్టీ పేరు, గుర్తును ఆ వర్గానికే ఈసీఐ కేటాయించింది.

Updated Date - Feb 06 , 2024 | 08:45 PM