Share News

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవాల్సిందేనా?

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:14 PM

అమెరికా అధ్యక్ష బాధ్యతలను మరోసారి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఈమధ్య వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరో ఆరు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవాల్సిందేనా?
Half Americans Think Trump Should End Campaign

అమెరికా అధ్యక్ష బాధ్యతలను మరోసారి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) ఈమధ్య వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరో ఆరు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (America President Elections) జరగనున్న నేపథ్యంలో.. హష్ మనీ కేసులో (Hush Money Case) న్యూయార్క్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చడం పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో ఆయనకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో.. ట్రంప్‌కు దిమ్మతిరిగేలా ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. దాదాపు సగం మంది అమెరికన్లు.. అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ తప్పుకోవాలని బలంగా కోరుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది.

గత నెల గురువారం (మే 30న) ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చిన మరుసటి రోజే ఒక ప్రైవేట్ కంపెనీ ఆ తీర్పుపై ఓ సర్వే నిర్వహించింది. మే 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించగా.. హష్‌ మనీ కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా ప్రకటించడం సరైన తీర్పేనని 50 శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారు. కానీ.. 27 శాతం మంది మాత్రం ట్రంప్‌ను దోషిగా తేల్చడాన్ని తప్పపట్టారు. మిగిలిన 23 శాతం మంది ఈ కేసులోని తీర్పు సరైందా? కాదా? అనే విషయంపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.

ఇదే సమయంలో.. ఈ కేసులో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమైనవని, అతని ఇమేజ్‌ను దెబ్బతీసేందుకేనని 47 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్టు ఆ సర్వే పేర్కొంది. కానీ.. 51 శాతం మంది మాత్రం ఈ కేసులో ట్రంప్ అక్రమానికి పాల్పడ్డారని తమ అభిప్రాయం తెలిపినట్లు ఆ సంస్థ చెప్పింది. ఓవరాల్‌గా పూర్తి గణాంకాలు చూసుకుంటే.. 49 శాతం మంది అమెరికన్లు అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ వైదొలగాలని సూచించారని ఆ సర్వే కుండబద్దలు కొట్టింది.


ఇంతకీ హష్ మనీ కేసు ఏంటి?

తాను 2006లో డొనాల్డ్ ట్రంప్‌తో ఒక హోటల్‌లో గడిపానని, ఆరోజు తాము శృంగారంలో పాల్గొన్నామని శృంగారతార స్టార్మీ డేనియల్స్ గతంలో ఆరోపణలు చేసింది. అయితే.. ఈ విషయం తన రాజకీయ ప్రస్థానానికి అడ్డంకి అవ్వకూడదన్న ఉద్దేశంతో, దాన్ని దాచిపెట్టేందుకు గాను ట్రంప్ ఆమెకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారు. ఈ అంశం కోర్టుదాకా వెళ్లడంతో.. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగింది. ఫైనల్‌గా ట్రంప్‌పై నమోదైన 34 అభియోగాలు రుజువయ్యాయని న్యూయార్క్ కోర్టు పేర్కొంటూ.. ఈ హష్ మనీ కేసులో అతనిని దోషిగా తేల్చింది. ఈ కేసులో జులై 11న అతనికి శిక్ష ఖరారు చేయనున్నారు. దీంతో.. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చరిత్రకెక్కారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 04:14 PM