Share News

Bangladesh: బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు.. పోలింగ్‌ను బహిష్కరించిన ప్రతిపక్షాలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 07:53 AM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు.. పోలింగ్‌ను బహిష్కరించిన ప్రతిపక్షాలు

ఢాకా: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అవామీ లీగ్ చీఫ్ అయిన ప్రధానమంత్రి షేక్ హసీనా వరుసగా నాలుగో సారి అధికారంలోకి రావడంపై కన్నేశారు. మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. అయితే ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా 48 గంటలపాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమ్మె సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశాలుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఇప్పటికే శుక్రవారం రాత్రి ఆందోళనకారులు ఎక్స్‌ప్రైస్ రైలుకు నిప్పటించిన సంగతి తెలిసిందే. దీంతో రైలులోని నాలుగు బోగీలు దగ్దమయ్యాయి. ఐదుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. మొత్తం 300 స్థానాలకు జరగనున్న ఈ పోలింగ్ ప్రక్రియలో 11 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం 42 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 27 రాజకీయ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు హెచ్‌ఎమ్ ఇర్షాద్ జాతీయ పార్టీ, తృణముల్ బీఎన్‌పీ, ఇస్లామీ ఫ్రంట్, ఇస్లామీ ఐక్యో జోట్, క్రిషక్ శ్రామిక జనతా లీగ్, గణ ఫోరమ్,గణ ఫ్రంట్ తదితర పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. కాగా ఈ నెల 8న ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 07 , 2024 | 07:53 AM