Share News

Lunch Box Facts: ఆఫీసుకు రోజూ లంచ్ బాక్స్ తీసుకెళ్లే అలవాటుందా? ఆహార నిపుణులు బయటపెట్టిన నిజాలివీ.. !

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:01 PM

లంచ్ బాక్స్ అంటే ఆహారం విషయంలో ఇక సేఫ్ అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. కానీ లంచ్ బాక్స్ విషయంలోనూ తప్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇవి కూడా చిన్న చిన్నవేం కాదు.. తరచి చూస్తే చాలా పెద్ద తప్పులే జరిగిపోతున్నాయట

Lunch Box Facts: ఆఫీసుకు రోజూ లంచ్ బాక్స్ తీసుకెళ్లే అలవాటుందా? ఆహార నిపుణులు బయటపెట్టిన నిజాలివీ.. !

ఉద్యోగాలు చేసేవారిలో చాలామంది లంచ్ బాక్స్ తీసుకెళ్లడానికి ఇష్టపడతారు. రోజూ బయట లంచ్ చేయడం అధిక ఖర్చుతో కూడుకున్నదే కాదు.. ఆరోగ్యపరంగా చూసినా మంచిది కాదు. అందుకే ఇంటి దగ్గర వండిన ఆహారాన్ని లంచ్ బాక్స్ తీసుకెళ్లడానికి అందరూ మొగ్గు చూపుతారు. ఇంట్లో వండిన ఆహారం శుభ్రత నుండి పోషకాల వరకు ఏ విషయంలోనూ వంకలు పెట్టలేం. కాబట్టి లంచ్ బాక్స్ అంటే ఇక సేఫ్ అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. కానీ లంచ్ బాక్స్ విషయంలోనూ తప్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇవి కూడా చిన్న చిన్నవేం కాదు.. తరచి చూస్తే చాలా పెద్ద తప్పులే జరిగిపోతున్నాయట. రోజూ ఆఫీసుకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లేవారు తీసుకెళుతున్న లంచ్ బాక్స్ విషయంలో ఏ మిస్టేక్స్ జరుగుతాయి? తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే..

ఉష్ణోగ్రత..

లంచ్ బాక్స్ విషయంలో చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినది ఉష్ణోగ్రత. బాక్స్ లో ఆహారం సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసాహారం కనుక ప్యాక్ చేస్తుంటే అది 40°F నుండి 140°F మధ్య ఉంటే మాత్రం అది మధ్యాహ్నానికల్లా పాడైపోయే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా వేగంగా చర్య జరిపి ఫుడ్ పాయిజన్ కు దారితీయవచ్చు.

ఇది కూడా చదవండి: విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?


క్రాస్ పొల్యూషన్..

చాలావరకు ఆహారం దేనికది విభిన్నంగా ఉంటుంది. అందుకే ఏ ఆహారాన్ని అయినా కలిపి ప్యాక్ చేయకూడదు. దేనికది విడిగా వేర్వేరు బాక్సులలో ప్యాక్ చెయ్యాలి. ఆహారాలు కలిపి ప్యాక్ చేస్తే బ్యాక్టీరియా తొందరగా డవలప్ అవుతుంది. అది ఇతర ఆహారాలకు కూడా వ్యాప్తి చెంది ఆహారం పాడయ్యే అవకాశం ఉంది. కేవలం ప్యాక్ చేయడమే కాదు. వండటానికి ఉపయోగించే పాత్రలు కూడా శుభ్రంగా ఉండాలి.

ప్యాకింగ్..

ఆహారాన్ని ప్యాక్ చేయడం కూడా ఒక కళ. కొన్ని ఆహారాలు లంచ్ టైమ్ లోపే పాడైపోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రయాణంలో తీసుకెళ్లడం పెద్ద టాస్క్ లా ఉంటుంది. ఇలాంటి వాటిని వేర్వేరు పద్దతులలో ప్యాక్ చేయాలి. తొందరగా పాడైపోయే అవకాశం ఉన్నవాటిని ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్ లు, ఐస్ ప్యాక్ లతో కూడిన కూలర్లు ఉపయోగించాలి.

సమతుల ఆహారం..

లంచ్ బాక్స్ కోసం ఏదో ఒకటి ఇంటి ఫుడ్ అనే నిర్లక్ష్య వైఖరిలో కాకుండా సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఆఫీసు పని అనంతరం తిరిగి ఇంటికి చేరుకోవడానికి సరైన పోషకాలు శరీరానికి అందాలి. లంచ్ లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు.. వంటివన్నీ ఉండాలి. ఇందుకోసం కాల్చిన చికెన్, చిక్కుళ్లు, పన్నీర్, టోపు వంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

పోర్షన్..

కొందరు లంచ్ బాక్సులో చాలా కొద్ది ఆహారాన్ని ప్యాక్ చేసుకుంటే మరికొందరు ఎక్కువ మొత్తంలో ప్యాక్ చేసుకుంటారు. అయితే ఆఫీసులలో కూర్చుని పనిచేస్తారు కాబట్టి ఎక్కువ మొత్తం ఆహారం ఉండకూడదు. కానీ ప్రోటీన్లు బాగుండాలి. తక్కువ కేలరీలు శరీరానికి అందాలి. శరీరానికి శక్తి బాగా అందాలి.

పానీయాలు..

చాలామంది సోడా, కార్బోనేటెడ్ పానీయాలు, జ్యూస్ లు వంటివి లంచ్ లో భాగం చేస్తుంటారు. కానీ వీటిని నివారించాలి. వీటికి బదులు మంచి నీరు పుష్కలంగా తీసుకోవాలి. రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 04:01 PM