Share News

Health Tips: ఈ 4 మొక్కలను ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఎన్ని లాభాలుంటాయంటే..!

ABN , Publish Date - Feb 19 , 2024 | 10:27 AM

ఈ నాలుగు మొక్కలు ఇంట్లో పెంచుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు.

Health Tips:  ఈ 4 మొక్కలను ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఎన్ని లాభాలుంటాయంటే..!

ఆయుర్వేదంలో వైద్యం చేయడానికి చాలా వరకు మొక్కలను ఉపయోగిస్తారు. ఇంట్లో పెద్దలు జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలకు ఇంటి వైద్యం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఆరోగ్య సమస్యలను ఇంట్లోనే పెంచుకునే కొన్ని మొక్కలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. మొక్కలలో పువ్వులు, ఆకులు, కాండం, వేర్లు ఇలా అన్ని భాగాలు ఆరోగ్యం బాగు చెయ్యడానికి ఉపయోగపడతాయి. ఇంట్లో నాలుగు రకాల మొక్కలు ఉంటే చాలు చాలా సమస్యలు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద వైద్యుల నుండి వైద్యం మీద అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో పెంచుకోవలసిన 4 రకాల మొక్కలేంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

మెంతి మొక్క..

మెంతి ఆకులను ఆహారంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. మెంతి ఆకులు, మెంతి గింజలను తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలు సాధారణంగా ఉంటాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. వాపు తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలలో నెలసరి తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మెంతి మొక్కను ఒక కుండలో లేదా చిన్న బకెట్ లేదా బుట్ట మొదలైన వాటిలో ఇంట్లో పెంచుకోవచ్చు.ఆరోగ్యవంతమైన జుట్టుకు, చర్మానికి కూడా ఇది చాలా మంచిది.

ఇది కూడా చదవండి: మనచుట్టూ ఉండే అత్యంత విషపూరితమైన మొక్కలివీ..!


కలబంద..

కలబంద గురించి అందరికీ తెలిసిందే.. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ మొక్కను ఎక్కువగా అలంకరణ కోసం పెంచుతారు. కలబంద ఆకుల గుజ్జును తినవచ్చు, జుట్టు, చర్మ సంరక్షణలో కూడా విస్తృతంగా ఉపయోగించవచ్చు. చికాకులు, కాలిన గాయాలు, కీటకాలు కుట్టినచోట, కోతలు, చిన్న గీతలు నయం చేయడానికి కూడా కలబంద గుజ్జు ఉపయోగించవచ్చు. ఇక దీన్ని పరగడుపునే తీసుకుంటే బరువు కూడా సులువుగా తగ్గుతారు.

కరివేపాకు..

కరివేపాకును ఆహారంలో మాత్రమే కాకుండా చాలా ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో ఉపయోగిస్తారు. కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు. కరివేపాకు టీ త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కంటి చూపుకు, మధుమేహం ఉన్నవారికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

తులసి..

తులసి మొక్కను ఇంట్లో పూజిస్తారు కానీ దానిలోని ఔషధ గుణాలు మాటల్లో చెప్పలేనివి. ఆయుర్వేదంలో ఔషదంగా ఉపయోగించే తులసిని రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేసే హీలింగ్ గుణాలు ఇందులో ఉన్నాయి. తులసి కషాయం తాగడం వల్ల కాలానుగుణంగా వచ్చే దగ్గు, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Fast Food: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే కిడ్నీలు పాడవుతాయా? దీనివెనకున్న అసలు నిజాలివీ..


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 10:27 AM