Share News

YS Jagan: ‘రాప్తాడు’తో రగులుతున్న రాయలసీమ

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:30 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు..

YS Jagan: ‘రాప్తాడు’తో రగులుతున్న రాయలసీమ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు.

ఈ రోజుకూ గొంతెండిపోతున్న రాయలసీమ ప్రజల మనోభావాల్లో దివంగతుడై ఏళ్లు గడుస్తున్నా జల యజ్ఞం ద్వారా రాజశేఖరరెడ్డి సముచితం స్థానం పొందారు. రాయలసీమలో రాజశేఖర రెడ్డి పరపతే జగన్మోహన్ రెడ్డికి ఆలంబన అయింది. పరోక్షంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఊపిరి లూదింది. రాజశేఖర రెడ్డి బిడ్డగా పాదయాత్ర సమయంలోనూ 2019 ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు సీమ ప్రజలు అమాయకంగా నమ్మారు. అయితే ఈ రోజు మోస పోయామని వగస్తున్నారు. మిగతా ప్రాంతాలకు భిన్నంగా రాయలసీమకు రాజశేఖర రెడ్డితో అనుబంధానికి ప్రాతిపదిక లేకపోలేదు. తరతరాలుగా రాయలసీమ వాసుల డియన్ఏలోనే నీటి తపన ఇమిడి వుంది. ఉపాధి కోసం లేక పట్టెడన్నం కోసం వలసలు పోవడం ఎరుగుదుం. అయితే రాయలసీమలో ఆఖరుకు గుక్కెడు తాగునీటి కోసం వలస బాట పట్టిన సందర్భాలున్నాయి.

కొన్ని చారిత్రక తప్పిదాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కాని రాయలసీమ ఇతర ప్రాంతాలకు భిన్నమైనది. ఎవరినైనా కదపండి. ముందు నీళ్ల గురించి వాపోతారు. బాగా వెనుకబడిన ఉత్తరాంధ్ర వాసులను కదిపితే నిరుపయోగంగా వున్న సముద్ర తీరం గురించి చెబుతారు. సామాజిక భౌతిక నైసర్గిక పరిస్థితులు ఇందుకు కారణం. రాయలసీమ పురోగతిని దృష్టిలో పెట్టుకొనే 1937 లో జరిగిన శ్రీ బాగ్ ఒడంబడికలో విద్యతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కోవకు చెంది కృషి చేసిన రాజశేఖర రెడ్డి పరపతితో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు.

ఇంత కథనం ఎందుకంటే ఏ పునాదుల మీదైతే జగన్మోహన్ రెడ్డి ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నారో ఇటీవల రాయలసీమ నడి బొడ్డున అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ ఎన్నికల సభలో వాటి ఛాయలు లేకుండా పునాదులతో సహా పెకలించి వేసి తన మార్క్ కొత్త రాజకీయం తెర మీదకు తెచ్చారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చుకు మాట మాత్రంగా కూడా రాప్తాడు సిద్ధం సభలో రాయలసీమ వాసుల చిరకాల వాంఛితమైన సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడ లేదు. అయిదేళ్ల కాలంలో రెండున్నర లక్షల కోట్లు పంపిణీ చేశానని చెప్పుకొచ్చారు. ఒక విధంగా క్రమేణా రాజశేఖర రెడ్డి ప్రాభవం నుండి బయటపడుతూ స్వంత ఇమేజ్ సృష్టికి శ్రీకారం చుట్టారేమోననిపిస్తోంది. ఈ క్రమంలోనే తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన తండ్రి రాజశేఖర రెడ్డి వారసత్వానికే కాకుండా రాయలసీమ సమాజానికీ నిస్సిగ్గుగా వెన్నుపోటు పొడిచారు. పాదయాత్ర సమయంలోనూ, 2019 ఎన్నికల ప్రచారంలో తను చేసిన హామీలను కట్ట గట్టి అటకెక్కించారు. ఇది జగన్మోహన్ రెడ్డికి అనివార్యం కూడా. రాయలసీమ నడిబొడ్డున జరిగిన రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యధాలాపంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించ లేదని భావించేందుకు ఆస్కారం లేదు. ఒక పద్ధతి మేరకే దూరాలోచనతో స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకు ఆ తరహా ప్రసంగం సాగించారనేందుకు ప్రాతిపదిక వుంది.

రాప్తాడు సభ జరిగిన పక్షం రోజుల్లోనే చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడును కట్టడి చేసేందుకు హంద్రీనీవా జలాలు విడుదలకు సిద్ధం సభ నిర్వహించారు. ఇందుకు చేపట్టిన చర్యలు అతి క్రూరమైనవి. హంద్రీనీవా ఎత్తిపోతలు ద్వారా 40 టియంసిల నీళ్ళు తరలించ వలసి వుండగా దాదాపు పాతిక టియంసిలు మాత్రమే ఈ ఏడు తరలించారు. పైగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హంద్రీనీవా ప్రాజెక్టు 400 కిలోమీటర్ల కాలువ వెంబడి రైతులు వేసిన పంటలు ఎండి పోతున్నా వారిని చుక్క నీరు తీసుకోనీయకుండా కట్టడి చేశారు. గత నెల రోజులుగా ఈ ప్రాంత రైతులు తమ పంటలు ఎండి పోతున్నాయని ఆందోళన చేసినా పట్టించుకున్న వారు లేరు. తుదకు రాప్తాడు సిద్ధం సభ సమయంలో అనంతపురం జిల్లా రైతులు నిరసనలకు దిగారు. కాని కుప్పం వరకు నామమాత్రంగా నీళ్లు తీసుకెళ్లి లాకులెత్తి నీళ్లు వదిలారు. ఈ ఎన్నికల స్టంట్ ముగింపునకు కాలువ ముంగిట వున్న రైతులను బలి పశువులను చేశారు. పైగా రెండు జిల్లాల ప్రజలు మధ్య వైషమ్యాలకు బీజం వేశారు. ఫిబ్రవరి 24వ తేదీకి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 816 అడుగులకు పడిపోయి కేవలం జలాశయంలో 38 టియంసిలు మిగిలాయి. పంపింగ్ చేసే అవకాశం లేదు. తుదకు కుప్పం లోనూ పంటలకు నీరు ఇచ్చే అవకాశం లేదు. కేవలం రాజకీయ దురద మాత్రం తీర్చుకున్నారు. సద్వినియోగం కావలసిన నీరు పారుదల నష్టం కింద పోయింది. ఇంతటి విపత్కర పరిస్థితిలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేలాది రైతుల పొట్ట గొట్టి కుప్పంకు నీటి తరలింపునకు జగన్మోహన్ రెడ్డి సిద్ధ పడ్డాడంటే ఎంతటి గుండెలు తీసిన బంటు అయి వుండాలి! ముఖ్యమంత్రి సభ పూర్తి కాగానే మొత్తం కట్ట కట్టేస్తారు. ఈ చర్య రాయలసీమకు వెన్నుపోటు కాదా?

నాణేనికి మరో వేపు నిలువునా గొంతు కోసే విధంగా వుంది. గత అయిదేళ్ల ముచ్చట పక్కన పెట్టినా మున్ముందు అయినా తను పాదయాత్ర చేసిన సమయంలో చేసిన హామీలు వాగ్దానాల గురించి సిద్ధం ఎన్నికల సభల్లో పునశ్చరణ చేస్తారని నమ్మి ఆఖరుకు హతాశులు కావడం సీమవాసుల వంతైనది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రాయలసీమలోని పలు ప్రజా సంఘాలు వచ్చే ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో రాయలసీమ వెనుకబాటు తనం నివారణకు కీలక మైన సాగునీటి ప్రాజెక్టుల అంశం పొందు పర్చాలనే ఉద్యమం చేపట్టాయి. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. రాయలసీమలోని పలు కేంద్రాల్లో యువకులు, రైతు నేతలు చురుగ్గా పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నేతలతో సహా అన్ని పార్టీల వారికి విజ్ఞాపనలు ఇస్తున్న దశలో ముఖ్యమంత్రి రాప్తాడు సభ ప్రసంగంలో ఈ అంశాలు మాట మాత్రంగా రానీయకపోవడం శరాఘాతంగా మిగిలింది. కేవలం సంక్షేమ పథకాలే తన ప్రాధాన్యాలుగా వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ పురోగతికి కూడా అన్ని రోగాలకు జిందాతిలిస్మాత్‌ అన్నట్లు తను పంపకం చేసిన రెండున్నర లక్షల కోట్లు పథకాలు చాలన్నట్లు ప్రసంగం సాగించారు. ఫలితంగా రాయలసీమకు ప్రత్యేక అస్తిత్వాన్ని కోరే వారంతా రాప్తాడు సభ తర్వాత రగిలి పోతున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా వుంది. తెలుగుదేశం హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని చాలామంది కాలికి బలపం కట్టుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఒరగ బెడతారని ఆయన గెలుపే తమ గెలుపుగా భావించి 2019 ఎన్నికల్లో పని చేశారు. మంచు తెరలు తొలగి పోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన రెండు సంవత్సరాలకే సీమలో జగన్మోహన్ రెడ్డి పర్యటన వుంటే ప్రతిపక్షాల వారితో పాటు ఇట్టి వారి ఇళ్లకు పోలీసులు హాజరై పహరా చేపట్టారు. మరీ ఒక నేత అయితే కుయ్యే మొర్రో అంటూ ఇంతలోనే తనకు ఈ దుర్గతి పడుతుందని ఊహించ లేదని అంతిమంగా జిల్లా పరిషత్ ఛైర్మన్ సిఫార్సుతో ఇంటి వద్ద గల పోలీసుల నుండి బయట పడి ముఖ్యమంత్రికి బారికేడ్ల ఆవల నుండి మెమోరాండం ఇచ్చుకున్నారు. మొన్న రాప్తాడు సిద్ధం సభ ముందు రోజు కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పని చేసిన వారి ఇళ్ల వద్ద పోలీసులు ప్రత్యక్షమైనారు. బొజ్జా దశరథరామి రెడ్డిని అయితే తెలుగుదేశం హయాంలో కేసు నమోదు అయిందని చెప్పి ఏకంగా అరెస్టు చేశారు. వీరంతా టీడీపీ వారు కానే కాదు. నిజాయితీగా సీమ అస్తిత్వం కోరే వారే. ఇలాంటి వారే తుపాకి నీడలో వుండాల్సి వస్తే రాయలసీమలో సాధారణ పౌరులు ఎంత మంది బలౌతున్నారో. ప్రస్తుతం రాయలసీమలో అనూహ్యమైన నిశ్శబ్దం నెలకొన్నది. ఒక్కటి మాత్రం నిజం. ఇది తుఫాను ముందు నెలకొనే ప్రశాంతత మాత్రమే.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - Mar 01 , 2024 | 08:37 AM