Share News

Former PM Manmohan Singh : చరిత్ర మరచిపోని మంచిమనిషి

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:20 AM

పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు (లోక్‌సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.

Former PM Manmohan Singh : చరిత్ర మరచిపోని మంచిమనిషి

యూపీఏ రెండో ప్రభుత్వం వేసిన ప్రతి తప్పటడుగుకు నిందలు భరించడానికి బదులు ప్రధానమంత్రి పదవి నుంచి మన్మోహన్‌ నిష్క్రమించి ఉండవలసింది. ఆయన మంత్రిమండలి సభ్యులపై పోటెత్తిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠను పూర్తిగా దిగజార్చాయి. అయినప్పటికీ చరిత్ర ఆయనపై తన తీర్పును చాలా అభిమానపూర్వకంగా ఇచ్చి తీరుతుంది, సందేహం లేదు.

పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు (లోక్‌సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. అప్పుడు నేను ఎన్‌డీ టీవీలో పనిచేస్తున్నాను. ‘ఫాలో ది లీడర్‌’ ‘అనే ఒక ఎన్నికల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఎన్నికలలో పోటీ చేస్తున్న ఒక నాయకుడి ప్రచారంలో ఒకరోజు పాటు ఆయన వెన్నంటి ఉండి వార్తా నివేదన చేయడం ఆ కార్యక్రమం ప్రత్యేకత. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రచార సరళిని కవర్‌ చేసే బాధ్యతను నాకు అప్పగించారు. నియోజకవర్గం పర్యటనలో మన్మోహన్‌ వెంట ఉండి మా కార్యక్రమానికి అవసరమైన సమాచారాన్ని సమకూర్చాలి. చెప్పినంత తేలిక కాదు ఈ పని. ఎందుకంటే ఆయన బిడియస్తుడు. పది మందిలో ఉండలేరు. టీవీ కెమెరాల ముందుకు రావడానికి సంకోచిస్తారు. మేము ఆ రోజు మొదటి సగాన్ని ఆయన గృహంలోనే గడిపాము ఆయనతో కలిసి ఉదయం ఉపాహారం తీసుకున్నాం. ఆ తరువాత ఆయన విస్తృత గ్రంథాలయంలో మాటా మంతీ జరిపాము. ఆ తరువాత మన్మోహన్‌ తన నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన వెంట వెళ్లాం. అక్కడ గుంపుల మధ్య ఉండవలసిరావడంతో ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. తోపులాటలు, నెట్టుకోవడాలు ఆయనకు సుతరామూ నచ్చవు. అయినా ఆయన ఓపిక వహించారు.


మంచి రోజులలోను, కష్టాలు చుట్టుముట్టిన రోజులలోను హుందాతనం కోల్పోకుండా మెలగడం ఎలా అన్నది మన్మోహన్‌ జీవితం నుంచి మనం నేర్చుకోవలిసిన పాఠం. ప్రజా జీవిత ఒత్తిళ్లు తన స్థితప్రజ్ఞతను ప్రభావితం చేసేందుకు ఆయన ఎన్నడూ అనుమతించ లేదు. విప్లవాత్మక కొత్త పుంతలు తొక్కిన భారత ఆర్థిక మంత్రి ఆయన. ప్రధానమంత్రిగా కీలక ఇండో– అమెరికా అణు ఒప్పందానికి ఆయనే ప్రధాన కారకుడు అయ్యారు. అయితే ఇందుకు ఆయన గానీ, ఆయన కుటుంబ సభ్యలుగానీ ఎటువంటి ప్రచారాన్నీ కోరుకోలేదు ఒక టీవీ షోలో భాగంగా ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ అనే పాటను ప్రసారం చేశాం. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు ఫోన్‌ వచ్చింది. అంత ఉల్లాస స్థితిని మరోసారి చూపించకుండా నివారించడం మంచిదని సూచించారు. మరో సందర్భంలో మన్మోహన్‌ను ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేశాం. ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో నిర్వహించదలిచిన ఆ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావడానికి నిరాకరిస్తూ దానిని తన ఇంటి వద్దనే స్వీకరించేందుకు ఆయన సంకోచిస్తూ అంగీకరించారు. ‘నాకంటే ఎన్నో గొప్ప విజయాలు సాధించినవారు మరెందరో ఉన్నారని’ ఆయన వినమ్రంగా ప్రతిస్పందించారు.

స్వీయ ఉన్నతికి స్వీయ ప్రచారం చేసుకోవడమే నిపుణ రాజకీయ వ్యూహంగా పరిగణన పొందుతున్న ఈ కాలంలో ఎటువంటి పటాటోపాలు లేని మన్మోహన్‌ సింగ్‌ పాతకాలం నాయకుల సత్సంప్రదాయాలకు ప్రతినిధిగా కనిపిస్తారనడం సత్యదూరం కాదు. జాతి శ్రేయస్సుకు మౌనంగా పనిచేసిన ఉదాత్త నాయకుడు ఆయన.


మన్మోహన్‌ తన వృత్తి జీవితంలో మొదటి నుంచీ నమ్మలేని రీతిలో నిర్దిష్ట పని గంటలకు మించి ఎక్కువగా పనిచేయడం అలవరచుకున్న వ్యక్తి. జీవితంలో చాలా కష్టపడి ఉన్నతస్థాయికి వచ్చినందున పనిపట్ల అతి నిష్ఠ, స్వీయ క్రమశిక్షణను తన విధి నిర్వహణలో అంతర్భాగం చేసుకున్నారు. ఆయనతో నా చివరి వ్యక్తిగత సమావేశాలలో ఒకసారి దేశ విభజన బీభత్సాల నుంచి తమ కుటుంబం ఎలా తప్పించుకున్నదీ వివరించారు. పేదరికంలో తాను పెరిగిన తీరు, ఉపకార వేతనాల ఆధారంగా విద్యాభ్యాసం చేయడం, విద్య ఆసరాతో ఉన్నత స్థాయికి ఎదగడం గురించి చెప్పారు. అప్పుడు ఆయన కొంచెం భావోద్వేగానికి లోనవడాన్ని గమనించాను. ఆయనలో అటువంటి భావోద్వేగ ధోరణి చాలా అరుదు. ఈ విషయాన్ని ఆయన భార్య కూడా గమనించినట్టున్నారు. వెంటనే మేమున్న గదిలోకి వచ్చి ‘బస్‌ కరో, టీ తీసుకుందాం రండి’ అని దృఢస్వరంతో అన్నారు. ఇంట శ్రీమతి మన్మోహనే బిగ్‌బాస్‌ అనేది స్పష్టం.

తన తొలి సంవత్సరాల గురించి ఆయన భావోద్వేగంతో వివరిస్తున్నప్పుడు సువ్యక్తమవుతున్న ఆకాంక్షా భరిత, ప్రతిభాపాటవాలే చోదక శక్తిగా ప్రభవిస్తున్న ‘నవ’ భారత కథకు ఆయనే పూర్వగామి అన్న వాస్తవం నాకు స్ఫురించింది, ఆశ్చర్యపరిచింది. ఈ నూతన భారతదేశం ఆవిర్భవించేందుకు అద్వితీయంగా దోహదం చేసింది ఆయనే అన్న వాస్తవాన్ని చరిత్ర విస్మరించదు మన్మోహన్‌ యవ్వన కాలంలోని భారతదేశంలో కులీన విద్యాధిక వర్గాలకు వెలుపలి వారికి అవకాశాలు తక్కువగా ఉండేవి. చదువులో ప్రశస్తంగా ఉండడమే ఆనాటి వారికి సమాజంలో, ఎదుగుదలకు ఒక ప్రధాన మార్గంగా ఉండేది. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్ ‘యాదృచ్ఛిక’ ‘ప్రధానమంత్రి కావచ్చు కాని ఆయన ఒక మెరిటోక్రాట్‌ (ప్రతిభా సంపన్నతతో ఎదిగిన వ్యక్తి). ఇది, మనం పొరపాటుపడడానికి వీలులేని ఒక నిశ్చిత సత్యం. తనకు లభించిన ప్రతి పరిమిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగారు. యువ మన్మోహన్‌ నాటి భారతదేశానికి 1991 అనంతర భారతదేశానికి మధ్య ఎంత వ్యత్యాసమున్నదో మనం విస్మరించకూడదు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన సాహసోపేత విధానాలతో తీర్చిదిద్దిన నేటి భారతదేశంలో ఎదుగుదలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తున్నాయి.


మన్మోహన్‌ మృదుభాషి. సొంత గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు. ఎటువంటి పరిస్థితులలోను నిండు ఆత్మ విశ్వాసంతో వ్యవహరించే వ్యక్తి. ఈ కారణంగానే ఎటువంటి అహమికలు, దురహంకారం, వ్యక్తి ఆరాధనా ఉన్మాదానికి లోనుకాకుండా అత్యున్నతస్థాయి అధికార పదవుల ఒత్తిళ్లను నిబ్బరంగా తట్టుకుంటూ సమర్థంగా తన బాధ్యతలను నిర్వర్తించగలిగారు. తన రాజకీయ పరిమితులు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఆ పరిధులలోనే ఆయన పనిచేశారు. సదా జాతి నిర్మాణ లక్ష్యాలకు ప్రాధాన్యమిచ్చి వాటికి కట్టుబడ్డారు. అణు ఒప్పందం లాంటి అనివార్యమైన కఠిన నిర్ణయాలను తీసుకోవలసివచ్చినప్పుడు ఆదేశించడం కాకుండా చర్చలు, ఏకాభిప్రాయ సాధనతో తీసుకున్నారు.

2009లో తన గుండె ఆరోగ్యం సజావుగా లేదని వెల్లడయినప్పుడే ఆయన రాజకీయ జీవితం నుంచి నిష్క్రమించి ఉండవలసిందేమో? ఆనాటి నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయింది. సంకీర్ణ రాజకీయాల ఒత్తిళ్లు పెరగసాగాయి. యూపీఏ రెండో ప్రభుత్వం వేసిన ప్రతి తప్పటడుగుకు నిందలు భరించడానికి బదులు ప్రధానమంత్రి పదవి నుంచి నిష్క్రమించి ఉండవలసింది. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ మన్మోహన్‌ వ్యక్తిగత నిజాయితీని, చిత్తశుద్ధిని ఎవరూ అనుమానించలేదు. అయితే ఆయన మంత్రిమండలి సభ్యులపై పోటెత్తిన అవినీతి ఆరోపణలు యూపీఏ రెండో ప్రభుత్వ ప్రతిష్ఠను పూర్తిగా దిగజార్చాయి. అయినప్పటికీ చరిత్ర ఆయనపై తన తీర్పును చాలా అభిమానపూర్వకంగా ఇచ్చి తీరుతుంది, సందేహం లేదు. 1991లో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఒక తరం రూపుదిద్దుకున్నది, లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించింది. జాతి పురోగతికి ఇంతగా దోహదం చేసినప్పటికీ మన్మోహన్‌ తన స్వతస్సిద్ధ స్వభావానికి అనుగుణంగా ఈ పురోగతి వైయక్తిక ప్రయత్నం వల్ల కాకుండా ఒక సమష్టి కృషి ద్వారా మాత్రమే సాధ్యమయిందని వినమ్రంగా చెప్పుతారు.


ఒక పాత్రికేయుడుగా మరొక ప్రత్యేక కారణానికి మన్మోహన్‌ను ప్రేమగా గుర్తు చేసుకుంటాను. ఆయన ప్రభుత్వాన్ని మేము తరచు తీవ్రంగా విమర్శిస్తుండేవాళ్లం. అయినా మన్మోహన్‌ గానీ, ప్రధానమంత్రి కార్యాలయంలోని ఆయన అధికారులుగానీ ఒక్కరు కూడా ఎన్నడూ నాకు ఫోన్‌ చేసి మందలించడమనేది జరగనేలేదు. 2జి స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహణలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును నేను తీవ్రంగా విమర్శించాను. ఆ తరువాత మన్మోహన్‌ను నేను ఒక అధికారిక కార్యక్రమంలో కలుసుకున్నాను. నన్ను చూడగానే నవ్వుతూ ‘నీ కాలమ్‌ను చదివాను. కొన్ని ముఖ్యమైన అంశాలను మీరు లేవనెత్తారు..’ అని ఆయన అన్నారు. ఇతర నాయకులలో ఎంత మంది అటువంటి సౌహార్ధభావంతో విమర్శలకు ప్రతిస్పందిస్తారు?

ఒక తుది జ్ఞాపకం. 2004 సార్వత్రక ఎన్నికలలో దిగ్భ్రాంతికరమైన ప్రజా తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. తదుపరి ప్రధానమంత్రి ఎవరు అవుతారనే విషయమై ఉత్తేజిత, వ్యాకులిత ఊహాగానాలు జరిగాయి. ఆ సందర్భంలో నేను సర్‌ డేవిడ్‌ బట్లర్‌తో ఒక తేనీటి విందులో పాల్గొన్నాను. సర్‌ డేవిడ్‌ సెఫాలజీ (ఓటింగ్‌ విధానంపై జరిపే విశ్లేషణ)కి మౌలిక గురుగా పేరుపొందారు. మన్మోహన్‌ సింగ్‌ ఆయనకు సుపరిచితుడు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇరువురూ సమకాలికులు. ‘రాజ్‌దీప్‌, నీకు తెలుసా? ప్రధానమంత్రి ఎవరు అవుతారన్న ప్రశ్నకు నా వద్ద సమాధానమున్నది. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు అన్ని విధాల యోగ్యుడైన వ్యక్తి ఒకరు నాకు తెలుసు’ మన్మోహన్‌ సింగ్‌ పేరును సర్‌ డేవిడ్‌ ప్రస్తావించగా ఎందుకు ఆయన్ని ప్రతిపాదిస్తున్నారని ప్రశ్నించాను. ‘భారత్‌కు అత్యున్నత స్థాయిలో ఒక మంచి మనిషి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నది. స్వప్రయోజనాలు, సొంత పార్టీ ప్రయోజనాల కంటే జాతి శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే మన్మోహన్‌ సింగ్‌ అటువంటి ఉత్తమ నాయకుడు’ అని సెఫాలజీ గురు సమాధానమిచ్చాడు. అవును, మంచి నడవడి అనేది ఘోరంగా నిరాదరణకు గురవుతున్న నాయకత్వ విలువ అయిపోయింది. సత్ప్రవర్తనను తక్కువ అంచనావేస్తే ఎలా? డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నిజాయితీ ఉన్న నాయకుడు. ప్రజా జీవితంలో మూర్తీభవించిన సభ్యత, మంచితనంకు ఆయన ఒక ఉత్కృష్ట ప్రతీక. ప్రజా జీవితంలో ఉండవలసిన, ఉండదగిన నాయకుడుగా మన్మోహన్‌ను ముందుగా చెప్పి తీరాలి.

-రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - Dec 28 , 2024 | 01:20 AM