Share News

Father: ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా.. తండ్రిపై కుమారుడి దారుణ దాడి

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:56 PM

అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని దారుణంగా హతమార్చాడో కుమారుడు. బాధ్యత మరచి, అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుమారుడిని మందలించడంతో పాటు అతడు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో డెబ్భై యేళ్ల తండ్రిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ రాక్షసంగా వ్యవహరించాడా ప్రబుద్ధుడు.

Father: ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా.. తండ్రిపై కుమారుడి దారుణ దాడి

- ముఖంపై ముష్ఠిఘాతాలు కురిపించి హత్య?

- ఆత్మహత్యగా పోలీసుల కేసు నమోదు

- వృద్ధుడి మృతిలో అన్నీ అనుమానాలే!

చెన్నై: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని దారుణంగా హతమార్చాడో కుమారుడు. బాధ్యత మరచి, అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుమారుడిని మందలించడంతో పాటు అతడు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో డెబ్భై యేళ్ల తండ్రిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ రాక్షసంగా వ్యవహరించాడా ప్రబుద్ధుడు. ఆఖరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. పెరంబలూరు(Perambalur) జిల్లా కృష్ణాపురంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ కుమారుడి దగ్గర లంచాలు తీసుకుని స్థానిక పోలీసులు.. కేసును తారుమారు చేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కొడుకు దాడితో వృద్ధుడు చనిపోగా, ఆ దెబ్బలు తాళలేక వృద్ధుడు విషం సేవించి మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో డీజీపీ శంకర్‌ జీవాల్‌ స్పందించారు. తక్షణం అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సంబంధిత పోలీసుల్ని ఆదేశించారు. పలువురి హృదయాలను కలసివేస్తున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి...

ఇదికూడా చదవండి: WhatsApp: బలవంతం చేస్తే భారత్‌ నుంచి వెళ్లిపోతాం!

సేలం జిల్లా ఆత్తూరులో ‘శ్రీ అమృత సెగో ఫ్యాక్టరీ’ వుంది. దాని యజమాని కొళందైవేలు కాగా, ఆయన కుమారుడు శక్తివేల్‌. చిన్నప్పటి నుంచి అల్లరిచిల్లరిగా తిరుగుతూ బాధ్యత లేకుండా వ్యవహరించేవాడని తెలిసింది. అంతేగాక తన జల్సాలకు డబ్బు సరిపోవడం లేదని, అందువల్ల ఆస్తిని తన పేర రాయాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసేవాడు. పెరంబలూరులో వున్న రైస్‌మిల్లును అతడే నిర్వహించేవాడు. దొరికిన చోటల్లా అప్పులు చేసి, జల్సాలకు ఖర్చుచేసేవాడు. ఆ అప్పులను తండ్రి కొళందైవేలు తీరుస్తుండేవాడు. ఈ వ్యవహారంలో తండ్రీకొడుకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆ రైల్‌మిల్లును తన పేర రాయాలని, తండ్రి ఆస్తిలో 50 శాతం తనకు ఇప్పుడే పంచి ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇందుకు కొళందైవేలు నిరాకరించాడు. దీంతో కోపం పెంచుకున్న శక్తివేల్‌ ఫిబ్రవరి 16వ తేదీన కృష్ణాపురంలోని తన ఇంటి సోఫాలో కూర్చొనివున్న తండ్రిపై దాడి చేశాడు. వృద్ధుడి ముఖంపై, రెండు దవడలు, కణతలపై ముష్ఠిఘాతాలు కురిపించాడు. దీంతో నోరు, ముక్కు, చెవుల నుంచి తీవ్ర రక్తం స్రవిస్తుండగా, కొళందైవేలు సోఫాలోనే పక్కకు ఒరిగిపోయాడు. అతను చనిపోయాడనుకుని సంతోష్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడకు వచ్చిన కార్మికులు కొళందైవేలును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈలోగా మళ్లీ అక్కడకు వచ్చిన శక్తివేల్‌.. తండ్రి ముఖంపై కాళ్లతో తన్నాడు. దీంతో కొళందైవేలు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని భార్య హేమ, కార్మికులు కలిసి తిరుచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. దానిపై అందిన ఫిర్యాదును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. శక్తివేల్‌ను స్టేషన్‌కు పిలిపించి, సకలమర్యాదలతో ‘మందలించి’ పంపించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొళందైవేల్‌ ఈ నెల 21న తుదిశ్వాస విడిచారు. అప్పటి నుంచి శక్తివేల్‌ పరారీలో వున్నాడు. అయితే ఈ విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదు. అయితే తండ్రిపై శక్తివేల్‌ చేసిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమవ్వడంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

nani1.jpg

ఇదికూడా చదవండి: Mumbai: నటుడు రవికిషన్‌కు ఉపశమనం, షినోవా పిటిషన్‌ను కోర్టు తిరస్కరణ..

ఈ విషయం తెలుసుకున్న డీజీపీ స్పందించారు. ఈ కేసుపై తక్షణం చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. దీంతో కైకాలత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని శక్తివేల్‌ను గురువారం అరెస్టు చేశారు. కొసమెరుపేంటంటే.. కొడుకు దాడి ఘటనతో మనస్తాపం చెందిన కొళందైవేల్‌.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే కనీసం కూర్చున్న చోటి నుంచి పైకి కూడా లేవలేని స్థితిలో వున్న కొళందైవేలుకు విషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన విషం సేవించే స్థితిలో వున్నాడా?.. అన్న అనుమానాలు రేగుతున్నాయి. శక్తివేల్‌ వద్ద లంచం పుచ్చుకున్న కొంతమంది పోలీసులు.. కేసును నీరు గార్చేందుకే కొళందైవేలు ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

దికూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ 'ఫేక్ వీడియో'.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 01:56 PM