Share News

AP News: బీజేపీకి విజయనగరం, అరకు! లోక్‌సభ సీట్లు, అభ్యర్థులపై స్పష్టత?

ABN , Publish Date - Mar 12 , 2024 | 02:57 AM

టీడీపీ-జనసేనతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ పోటీచేసే ఆరు లోక్‌సభ స్థానాలు, వాటిలో పోటీచేసే అభ్యర్థులపై దాదాపుగా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

AP News: బీజేపీకి విజయనగరం, అరకు! లోక్‌సభ సీట్లు, అభ్యర్థులపై స్పష్టత?

అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి కూడా

పొత్తులో వచ్చే లోక్‌సభ సీట్లు, అభ్యర్థులపై స్పష్టత?

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-జనసేనతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ పోటీచేసే ఆరు లోక్‌సభ స్థానాలు, వాటిలో పోటీచేసే అభ్యర్థులపై దాదాపుగా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, అనకాపల్లి-రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, అరకు-మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, రాజమహేంద్రవరం-రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం-సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తిరుపతి నుంచి రత్నప్రభ బరిలో నిలుస్తారని ఆ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. అలాగే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, ధర్మవరం-వరదాపురం సూరి, తిరుపతి-భానుప్రకాశ్‌రెడ్డి, కైకలూరు-కామినేని శ్రీనివాస్‌, పాడేరు-ఉమామహేశ్వరరావు, విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్‌రాజు పోటీ దాదాపు ఖాయమంటున్నారు. వీటితోపాటు బద్వేలు (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, మరో రెండు స్థానాల అభ్యర్థులను, లోక్‌సభ స్థానాల బరిలో నిలిచేవారిని రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

మారిన అసెంబ్లీ స్థానాలు.. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన అనంతపురం అర్బన్‌, దర్శి అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలో నిలవనున్నారు. వాటికి బదులు వేరే సీట్లను జనసేనకు కేటాయిస్తారు. బద్వేలు స్థానాన్ని టీడీపీ.. బీజేపీకి వదులుకోగా.. విజయవాడ పశ్చిమ, తిరుపతి, మరో స్థానాన్ని జనసేన కమలనాథులకు వదులుతున్నట్లు సమాచారం.

Updated Date - Mar 12 , 2024 | 07:37 AM