Share News

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు..

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:23 AM

వచ్చే నెలలో ఎన్నికయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీస్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా హస్తగతం చేసుకున్న

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు..
Vizag Steel Plant

  • రెండు కోక్‌ ఓవెన్లలో జీరో ఉత్పత్తి

  • 3 బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో రెండు మూసివేత పోర్టు కార్మికుల ఆందోళన ఫలితం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో ఎన్నికయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీస్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఆ పోర్టులో కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఆపరేషన్లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. వీరితో పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. కోకింగ్‌ కోల్‌ తయారీకి అవసరమైన విదేశీ బొగ్గును ఈ పోర్టు ద్వారానే స్టీల్‌ప్లాంటు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం 1.5 లక్షల టన్నుల బొగ్గుతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రెండు నౌకలు అదానీ గంగవరం పోర్టులో ఐదు రోజులుగా నిలిచిపోయాయి. బొగ్గు సరఫరా లేకపోవడంతో స్టీల్‌ప్లాంటులోని ఐదు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల్లో రెండింటిలో ఉత్పత్తిని జీరో చేశారు. అలాగే మూడు బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో ఇప్పటికే ఒకటి మూసేయగా, తాజాగా మరొకటి మూసేస్తున్నారు. ఇక మిగిలింది ఒక్కటే. రోజుకు 20 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 14 వేల నుంచి 15 వేల టన్నుల ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇకపై ఒక బ్లాస్ట్‌ ఫర్నే్‌సపై ఐదు నుంచి ఆరు వేల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి రాదు. కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలను షట్‌డౌన్‌ చేయడం వల్ల భారీ నష్టం జరగనుంది. వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.వందల కోట్ల వ్యయం అవుతుంది. తక్షణమే బొగ్గు సరఫరా పునరుద్ధరించకపోతే మిగిలిన మూడు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలను ఒక్కొక్కటిగా షట్‌ డౌన్‌ చేయాల్సి ఉంటుంది.


స్పందించని అదానీ యాజమాన్యం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ముడి సరకులన్నీ కన్వేయర్‌ బెల్డ్‌ ద్వారా అందించడానికి అదానీ గంగవరం పోర్టు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దానిని పాటించడం లేదు. కార్మికుల ఆందోళనను సాకుగా చూపుతోంది. మరోవైపు దీనివల్ల భారీ నష్టం ఎదుర్కొంటున్న స్టీల్‌ప్లాంటు కార్మికులు అంతా ఏకమై ప్లాంటుని కాపాడాలంటూ మంగళవారం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునను కలిశారు. అదే సమయంలో స్టీల్‌ప్లాంటు యాజమాన్యం మంగళవారం ఉదయం కార్మిక సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బొగ్గు కొరత వల్ల ఉత్పన్నమైన సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనాలనే దానిపై సలహాలు ఇవ్వాలని కోరింది.

పోర్టు కార్మికులకు స్టీల్‌ప్లాంటు సమస్య పట్టదా?

విశాఖ స్టీల్‌ప్లాంటులో శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు 30 వేల మంది పనిచేస్తున్నారు. మరో 50 వేల మంది పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. వేయి మంది కూడా లేని పోర్టు కార్మికుల ప్రయోజనాల కోసం లక్ష మంది ఆధారపడిన స్టీల్‌ప్లాంటుకు నష్టం జరుగుతుంటే ఎవరూ స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇలా ఆకస్మిక సమ్మె చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


గంగవరం పోర్టు నుంచి నౌకలన్నీ మళ్లింపు

అదానీ గంగవరం పోర్టులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడి కార్మికులు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి ఈ పోర్టుకు వచ్చే నౌకలను ముందుచూపుతో ఇతర పోర్టులకు మళ్లిస్తున్నారు. కాగా, గంగవరం పోర్టులో కంటెయినర్‌ కార్గో రవాణాకు ప్రత్యేకంగా టెర్మినల్‌ నిర్మించారు. బుధవారం నుంచి విదేశీ (ఎగ్జిమ్‌) కంటెయినర్‌ కార్గో హ్యాండ్లింగ్‌ చేయాలని రెండు నెలల క్రితమే ముహూర్తం పెట్టుకున్నారు. ఆ మేరకు ఓ నౌక కంటెయినర్లతో బయలుదేరి 16వ తేదీన ఇక్కడికి రావలసి ఉంది. అయితే ఆ కార్గోని హ్యాండిల్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో నౌకను చెన్నై పోర్టుకు మళ్లించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 09:21 AM