Share News

Rain Alert: దూసుకొస్తున్న రెమాల్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN , Publish Date - May 26 , 2024 | 04:44 PM

బంగాళఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తుంది. అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 6 గంటల్లో రెమాల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain Alert: దూసుకొస్తున్న రెమాల్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Cyclone Remal

కాకినాడ జిల్లా: బంగాళఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తుంది. అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 6 గంటల్లో రెమాల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

రెమాల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ తుపాన్ వల్ల పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లా యంత్రంగాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తూఫాన్‌గా బలపడింది. దీంతో ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి.


సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను కెరటాలు ముంచుతున్నాయి. తుపాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో నీటిమట్టం పెరిగింది. దీంతో మత్స్యకారులు భయాందోళనలో ఉన్నారు.రాకాసి అలలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలలతో పర్యాటకులు ఆటలాడుతున్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలను జారీ చేశారు.


తుఫాను తీరం దాటే సమయంలో సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి ఈదురు గాలులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి కొనసాగుతోంది. దీంతో బీచ్ రోడ్డులో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.


మరోవైపు తుఫాన్ నేపథ్యంలో కోల్‌కతాలో పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. ఇప్పటికే సముద్ర అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సుముద్ర తీరంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను కోరారు. బంగాళఖాతంతో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఈరోజు ఉదయం తీవ్ర తుఫాన్‌గా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిణి సునందా తెలిపారు.


ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ.. ఈరోజు రాత్రికి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒరిస్సా దక్షిణాది రాష్ట్రాలపై ఉంటుందని తెలిపారు. కలకత్తా, హుగ్లీ , హౌరా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెమాల్ తుఫాన్ వల్ల 100 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు రాత్రికి సముద్ర తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 10:46 PM