Share News

Ganta Srinivasa Rao: రాజ్యసభ ఎన్నికల కుట్రలో భాగంగానే రాజీనామా ఆమోదం

ABN , Publish Date - Jan 26 , 2024 | 04:05 PM

విశాఖకు తలమానికమైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. శుక్రవారం నాడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో గంటా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు.

Ganta Srinivasa Rao: రాజ్యసభ ఎన్నికల కుట్రలో భాగంగానే రాజీనామా ఆమోదం

విశాఖపట్నం: విశాఖకు తలమానికమైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. శుక్రవారం నాడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో గంటా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించిన తర్వాత తొలిసారి నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ వల్లే.. విశాఖపట్నంకు ఉక్కునగరంగా పేరు వచ్చిందని తెలిపారు. ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ కావాలని ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఆ విషయంలో వైసీపీ ఎంపీలు పోరాడాలి

స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎలాంటి సహకారం అందలేదని.. సీరియస్‌గా స్టీల్‌ప్లాంట్‌పై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. వైసీపీకి అత్యధిక ఎంపీల బలం ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడట్లేదని మండిపడ్డారు. ఎంపీల రాజీనామాలతో ప్రైవేటీకరణ ప్రక్రియ కనీసం నెమ్మదిస్తుందని భావించినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే కార్యచరణను.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని హామీ ఇచ్చారు. 2021 ఫిబ్రవరి 12వ తేదీన తాను రాజీనామా చేశానని తెలిపారు. ఈ రాజీనామాను ఆమోదించడం వల్ల ఉప ఎన్నిక వస్తుందని అది ప్రభుత్వానికి ఇబ్బందని జగన్ ప్రభుత్వం ఆలోచించిందన్నారు. మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని.. రాజకీయ కుట్రతోనే తన రాజీనామాను ఆమోదించారని తెలిపారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటును తగ్గించాలనే దురుద్దేశంతో తన రాజీనామాను ఆమోదించారని తెలిపారు. 50 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఓటు హక్కును కల్పించాలని కోర్టులో పిటీషన్ వేసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Jan 26 , 2024 | 04:34 PM