Share News

Chandrababu: బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?...

ABN , Publish Date - Feb 05 , 2024 | 01:34 PM

64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతుందని, ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని, ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.. ప్రజలు గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని, సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

Chandrababu: బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?...

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా, మాడుగులలో ‘రా.. కదలిరా' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతోందని, ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని, ఎన్నికల్లో రాష్ట్రం .. ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని, సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ గొప్పలు చెబుతున్నారని.. ‘బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి’? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌రెడ్డి అని, విద్యుత్‌ ఛార్జీలు పెంచి రూ. 64 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని చంద్రబాబు మండిపడ్డారు. చివరకు చెత్తపై కూడా పన్ను వేశారని, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. సీఎం బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయిందని, జగన్‌ది ఉత్తుత్తి బటన్‌ నొక్కుడని ప్రజలు గమనించాలన్నారు. జాబ్‌ క్యాలండర్‌కు ఎందుకు జగన్‌ బటన్‌ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు. మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దుపై బటన్‌ ఎందుకు నొక్కలేదన్నారు. రాష్ట్రంలో రోడ్ల బాగు కోసం ఎందుకు బటన్‌ నొక్కలేదు?.. డీఎస్సీ కోసం ఇన్నాళ్లూ ఎందుకు బటన్‌ నొక్కలేదు జగన్‌రెడ్డి? అంటూ ప్రశ్నించారు. ‘జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే’నని చంద్రబాబు వ్యాఖ్యనించారు.

మైనింగ్‌ బటన్‌ నొక్కి భూగర్భ సంపద దోచేశారని, ఇసుక బటన్‌ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారని, జగన్ బటన్‌ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. రేపు ప్రజలంతా ఒకే బటన్‌ నొక్కుతారని, ప్రజలు నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. ధనదాహంతో జగన్‌ ఉత్తరాంధ్రను ఊడ్చేశారని, రుషికొండను జగన్‌ ఆనకొండలా మింగేశారని దుయ్యబట్టారు. రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలస్‌ కట్టుకున్నారని, విశాఖలో రూ.40 వేల కోట్లు జగన్‌ దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ తన సలహాదారులకు రూ.వందల కోట్లు దోచిపెట్టారని, ఒక్క సజ్జల రామకృష్ణా రెడ్డికే సీఎం రూ.150 కోట్లు దోచి పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమి మింగేశారన్నారు. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. దోచుకోవడమే తప్ప.. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదన్నారు. విశాఖను గంజాయి కేంద్రంగా.. క్రైమ్‌ సిటీగా మార్చారని, గంజాయి అమ్ముతూ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయారన్నారు. జగన్‌రెడ్డి లాంటి సీఎం మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 05 , 2024 | 01:34 PM