TTD EO Shyamala Rao : త్వరలో ‘టీటీడీ చాట్ బాట్’
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:29 AM
చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
చాట్ జీపీటీ తరహాలో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
జనవరి నుంచి టీటీడీ ల్యాబ్ అందుబాటులోకి
భక్తుల వసతికి అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్
విజన్ డాక్యుమెంట్ మేరకు ప్రణాళికలు: ఈవో
తిరుమల, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దీనిద్వారా భక్తులు ఏ సమాచారాన్నైనా సులభంగా తెలుసుకోవచ్చని అన్నారు. తిరుమలలో గత ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధితో పాటు భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలపై ఆయన అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలసి అన్నమయ్య భవనంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో అనేక మార్పులు తెచ్చామని, అన్నప్రసాదాలు, లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నామన్నారు. ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిన రూ.70లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతగా ఏర్పాటు చేసుకుంటున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి ఆలయ మాడవీధులు అభివృద్ధి చేస్తామని, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో యువతలో భక్తి భావన పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047కి అనుగుణంగా తిరుమల విజన్-2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించామని, తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్టు శ్యామలరావు వెల్లడించారు.
లక్ష్యాలివే..
తిరుమల నడకమార్గాల ఆధునికీకరణ, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్ల నిర్మాణం, సబ్‌వేల నిర్మాణం, బస్టాండ్ల పునర్నిర్మాణం.
భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు. ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తిరుమలలో భవనాల రూపకల్పన.
టీటీడీలో ఉన్న 31 మంది హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం, లేదా వీఆర్‌ఎస్ ఇవ్వాలన్న బోర్డు నిర్ణయం మేరకు చర్యలు.
తిరుమలలో ఆక్రమణలకు పాల్పడుతూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు, హాకర్లు, లైసెన్సుదారులు, అనధికార తట్టలపై కఠిన చర్యలు.
ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు. ఇప్పటివరకు చేపట్టిన హెచ్‌డీపీపీ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగ్గా నిర్వహణ.
తిరుమలలోని ప్రైవేట్ క్యాంటీన్లలో ధరల నియంత్రణ, పేరొందిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగింత. నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు.
సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం, వసతి అందించడం.
దర్శన, వసతి, ప్రసాదాల దళారీల నియంత్రణ.