Share News

AP Politics: చంద్రబాబు, పవన్ కలవడంతో జగన్‌కు భయమేస్తోంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Feb 12 , 2024 | 06:09 PM

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడంతో సీఎం జగన్ రెడ్డికు నిద్రపట్టడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) అన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ సోమవారం నరసన్నపేటలో ప్రారంభమైంది.

AP Politics: చంద్రబాబు, పవన్  కలవడంతో జగన్‌కు భయమేస్తోంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడంతో సీఎం జగన్ రెడ్డికు నిద్రపట్టడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) అన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ సోమవారం నరసన్నపేటలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో నరసన్నపేట పసుపుమయంగా మారింది. యువనేతను కలిసేందుకు పెద్దఎత్తున సభ ప్రాంగణానికి మహిళలు తరలి వచ్చారు. ఈ సభలో ఎంపీ రామ్మెహన్ నాయుడు మాట్లాడుతూ...జగన్‌కు దొంగబుద్ది పోదని.. ప్రజలకు రూ. పది.. ఇచ్చి రూ.వంద లాగేసుకుంటున్నారని అన్నారు. రాబోయే కాలంలో టీడీపీ - జనసేన విజయానికి నాంది పలుకుతూ యువనేత శంఖారావం ప్రారంభించారని తెలిపారు. యువగళం తమ ప్రాంతం వస్తుందని ఎంతో ఆశతో తామంతా ఎదురుచూశామని.. భీమిలిలో నిలిచిపోవడంతో నిరాశచెందామని అన్నారు. తమ మాట మీద నిలబడి ఈ రోజు తమ నియోజకవర్గానికి వచ్చినందుకు లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సర్వనాశనం అవుతున్న స్థితినుంచి దేశంలోనే నెం.1గా రాష్ట్రాన్ని తయారుచేయడానికే లోకేష్ ముందుకు వచ్చారన్నారు. సైకో పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా ఇచ్చేందుకు యువనేత లోకేష్ పాదయాత్ర చేశారన్నారు. మరో రెండునెలల్లో రానున్న ఎన్నికల్లో సైకోల చర్యలను తిప్పికొట్టేందుకు టీడీపీ - జనసేన కార్యకర్తలు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి కోట్లరూపాయల నిధులు తెచ్చామని.. మున్సిపాలిటీగా ఉన్న పట్టణానికి కార్పొరేషన్ స్టేటస్ ఇచ్చింది కూడా చంద్రబాబు అని తెలిపారు. వైసీపీ నాయకులకు ఇసుక దోచుకోవడం తప్ప, రైతులకు నీరందించడం తెలీదని విమర్శించారు. పేరుకే శ్రీకాకుళం జిల్లాకేంద్రం, ఒక్కరోడ్డు కూడా నియోజకవర్గంలో సక్రమంగా లేదని.. ఈ రోడ్లపై తిరిగితే నరకానికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వెళ్లేరోడ్డు అధ్వాన్నంగా ఉందని.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా మంత్రి, స్పీకర్ పట్టించుకోకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం వలసల జిల్లా, స్థానికంగా ఉద్యోగావకాశాలు లేక ఇక్కడ యువత బాధపడుతున్నారని.. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో వలసలను నివారించడానికి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్, సెజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలవారు ఇక్కడకు ఉద్యోగాలకోసం వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతం నుంచి ఆర్మీకి వెళ్లి దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. అయిదేళ్లయినా ఇక్కడ స్టేడియంలో ఒక్క ఇటుక వేయలేదని.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్ కాంప్లెక్స్, స్టేడియం పూర్తిచేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. రానున్న కాలంలో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌ను ఏవిధంగా అభివృద్ధి చేశారో అలాగే శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబును కోరతామని తెలిపారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే అదంతా సాధ్యమవుతుందని.. పసుపుకండువా సత్తా ఏమిటో వైసీపీ సైకోలకు తెలియజేయాలన్నారు. జనసేన సోదరులను కూడా కలుపుకొని ముందుకు సాగాలన్నారు. ప్రజలు డిసైడ్ అయ్యారని.. జగన్ పని అయిపోయిందన్నారు. మరోసారి ఆయనకు ఓటువేయకూడదని నిర్ణయించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేసేందుకే లోకేష్ శంఖారావం యాత్ర ప్రారంభించారని వివరించారు. రెడ్ బుక్‌లో పేర్లున్న అధికారులకు శిక్ష తప్పదని.. దీంతో పాటు గ్రీన్ బుక్ కూడా లోకేష్ వద్ద ఉందని తెలిపారు. కార్యకర్తలంతా ఐకమత్యంతో ముందుకుసాగి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. లోక్ సభ, రాజ్యసభలో వైసీపీకి 31మంది ఎంపీలున్నారని.. జగన్ ఢిల్లీ వస్తే వారి ఎంపీలే ఆయన వెంట వెళ్లడానికి భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తే తమ భూములను కూడా కాజేస్తారని ఆ పార్టీ నేతలే భయపడిపోతున్నారని విమర్శించారు. రైతుల పాస్ పుస్తకాలపై సీఎం ఫొటో ఎందుకు..? అని ప్రశ్నించారు. ‘‘మీ బిడ్డని అని చెబుతూ మన ఆస్తులు కొట్టేయడానికి ప్లాన్ చేశారు, తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించారు. మధ్యనిషేధం చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న వ్యక్తి... ఈరోజు మందుపై వేలకోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చైతన్యవంతులైన ప్రజలు జగన్ దోపిడీని తెలుసుకున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జగన్ లాంటి నాయకులు భవిష్యత్తు‌లో ఏపీలో అడుగుపెట్టాలంటే భయపడేలా రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండాలని అన్నారు. ఒకబండికి ఉండే రెండు చక్రాల మాదిరిగా టీడీపీ - జనసేన కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు సూచించారు.

Updated Date - Feb 12 , 2024 | 10:36 PM