Share News

Delhi: రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:11 AM

కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి యువ, బాలసాహిత్య పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన బంజారా యువ రచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌కు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.

Delhi: రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం

  • ‘ఢావ్లో’ కథా సంపుటికి దక్కిన గౌరవం లంబాడాల సంస్కృతి,

  • జీవన చిత్రాన్ని కళ్లకు కట్టే కథలు చంద్రశేఖర్‌ ఆజాద్‌కు బాల సాహిత్య పురస్కారం

  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం

  • బాల సాహిత్య పురస్కారం‘మాయాలోకం’ నవల ఎంపిక

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి యువ, బాలసాహిత్య పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన బంజారా యువ రచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌కు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ కథా రచయిత పి.చంద్రశేఖర్‌ ఆజాద్‌ను బాల సాహిత్య పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ అధ్యక్షతన జరిగిన కార్యనిర్వహక మండలి సమావేశంలో ఈ ఏడాదికి 23 మంది యువ రచయితలకు యువ పురస్కారాలు, 24 మంది రచయితలకు బాల సాహిత్య పురస్కారాలను అందించాలని నిర్ణయించినట్లు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్‌ తండాలో జన్మించిన రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రచించిన ‘ఢావ్లో’ గోర్‌ బంజారా కథాసంపుటి సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైంది. ప్రొఫెసర్‌ సూర్యధనుంజయ్‌, ఆర్‌.సీతారామరావు, శిఖామణితో కూడిన న్యాయనిర్ణేతల బృందం రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.


రమేష్‌ కార్తిక్‌ పదో తరగతి నుంచే రచనలు చేస్తున్నారు. ఆయనకు ఇంతకు ముందు రావిశాస్తి కథా పురస్కారం, చిలకమర్తి లక్ష్మీనరసింహం పురస్కారాలతోపాటు అనేక అవార్డులు లభించాయి. గోర్‌ బంజారాల జీవితం, వారి సంస్కృతి, సంప్రదాయాలను ‘బల్దేర్‌ బండి’ కవిత్వం, ‘ఢావ్లో’ కథా సంపుటి, ‘చక్‌ మక్‌’ ఆంగ్ల కవిత్వం ద్వారా అక్షర బద్ధం చేశారు. కార్తీక్‌ నాయక్‌ రచించిన ‘జారేర్‌ బాటి (జొన్న రొట్టెలు)’ కవితను కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఖమ్మంలోని ఓ కళాశాల డిగ్రీ కోర్సు ఐదో సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఆంధ్రా వర్సిటీ ఎంఏ తెలుగు నాలుగో సెమిస్టర్‌ పాఠ్యాంశాల్లో ‘బల్దేర్‌ బండి’ కవితా సంపుటిని చేర్చారు. చాలా రోజుల తర్వాత కలిసిన బంధు మిత్రులను ఆలింగనం చేసుకొని దుఃఖించడం గోర్‌ బంజారాల సంస్కృతిలో భాగం. అలా కన్నీరు పెట్టడాన్ని లంబాడా భాషలో ‘ఢావ్లో’ అంటారు. ఆ పేరుతో వెలువడిన కథా సంపుటిలో గిరిజనుల బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టే ఎనిమిది కథలు ఉన్నాయని రచయిత చెప్పారు. అందులోని ‘పురుడు’ కథను వీబీ సౌమ్య ఇంగ్లి్‌షలోకి అనువదించగా.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ఐవోడబ్ల్యూఏ’లో ‘ది బర్త్‌’ పేరుతో ప్రచురితంకావడం విశేషం.


  • గోర్‌ బంజారా సంస్కృతికి

  • దక్కిన గౌరవం : రమేష్‌ కార్తీక్‌ నాయక్‌

తనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం గోర్‌ బంజారా సంస్కృతికి దక్కిన గౌరవం అని రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ అన్నారు. రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ యువ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్‌, ఆకాశవాణి సిబ్బందితో పాటు పలువురు కవులు, రచయితలు అభినందనలు తెలియజేశారు.


  • బాల సాహిత్యంలో ఆజాద్‌ ప్రయోగాత్మక రచనలు

    13.jpg

డీకే చదవుల బాబు, సీహెచ్‌ లక్ష్మణ చక్రవర్తి, పీఎస్‌ గోపాలకృష్ణతో కూడిన న్యాయనిర్ణేతల బృందం ఆజాద్‌ను బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన రాసిన ‘మాయాలోకం’ నవల ఈ పురస్కారానికి ఎంపికైంది. పదేళ్లు దాటిన పిల్లల కోసం రాసిన ఈ నవలకు 2021 తానా బాల సాహిత్య పోటీలో బహుమతి లభించింది. చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా వెల్లటూరు. ఆయన తొమ్మిది వందలకు పైగా కథలు, 90కి పైగా నవలలు, ‘రాధామధు’, ‘లయ’, ‘ఎదురీత’ తదితర టెలివిజన్‌ సీరియళ్లకు సంభాషణలు రాశారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ బాలల కోసం వందకు పైగా కథలు, పదికి పైగా నవలలు, పలు రేడియో నాటికలు రచించారు. ఎన్ని రచనలు చేసినా, బాల సాహిత్యమే తనకు గుర్తింపు, గౌరవాన్ని తెచ్చాయని చంద్రశేఖర్‌ ఆజాద్‌ చెప్పారు. బాల సాహిత్యంలో తన మొట్టమొదటి రచన ‘అందమైన పూల తోట’ నవల 1983లో ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైందని తెలిపారు. కాగా యువ, బాల సాహి త్య పురస్కారాలకు ఎంపికైన వారికి రూ.50 వేల చొప్పున నగదు, రజత పతకాలు అందజేస్తారు.

Updated Date - Jun 16 , 2024 | 04:12 AM