Share News

YSRCP: మాగుంటను వెంటాడిన వైఎస్ జగన్‌.. చివరి యత్నంగా ఇలా..?

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:15 AM

AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్‌ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.

YSRCP: మాగుంటను వెంటాడిన వైఎస్ జగన్‌.. చివరి యత్నంగా ఇలా..?

  • మాగుంటను వెంటాడిన జగన్‌

  • చివరి యత్నంగా మానసిక దాడి

  • టికెట్‌ ఇవ్వకుండా అవమానం

  • ఇవే అంశాలపై నేడు, రేపు అనుచరులతో ఒంగోలు ఎంపీ చర్చలు

  • కందుకూరులో సిద్ధం సామగ్రిని ఎవరూ తీసుకోని వైనం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్‌ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం. ఇవన్నీ ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Sreenivasulu Reddy) విషయంలో సీఎం జగన్‌, ఆయన పార్టీ సాగించిన అకృత్యాలు. ఈనేపథ్యంలో మాగుంట మంగళ, బుధవారాల్లో ఒంగోలులో మకాం వేసి అనుచరులు, అభిమానులతో మంతనాలు జరిపి తన రాజకీయ భవితవ్యంపై తుదినిర్ణయాన్ని అధికారికంగా తీసుకోనున్నారు.

వ్యాపారాలపై ఆంక్షలు

వైసీపీ 2019లో ఎలాగైనా విజయం సాధించా లన్న ఆకాంక్షతో వైసీపీ స్థానికంగా పేరు, ప్రతిష్ట లున్న నేతలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసిం ది. అందులో భాగంగా మాగుంటతో రాయబా రాలు నడిపి ఆయనపై ఒత్తిడి చేసి పార్టీలో చేర్చుకుని ఒంగోలు ఎంపీగా రంగంలోకి దింపింది. ఘనవిజయం సాధించిన మాగుంట ఎప్పటిలాగే వైసీపీలో చురుకైన పాత్ర పోషించే ప్రయత్నం చేయగా ఆరంభంలోనే ఆయనకు చుక్కెదురైంది. ఆయన వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. సింగరాయకొండ ఫ్యాక్టరీని మూతవేసింది. రాష్ట్రంలోనే లిక్కర్‌ వ్యాపారాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఆయన చేసే అభివృద్ధి పనులకూ ఆటంకాలు కల్పించింది. ఉదాహరణకు కేంద్రప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులకు నిధులు రాబట్టినా వాటిని రాష్ట్రం అడ్డుకుంది. చివరికి ఒంగోలు, సూరారెడ్డిపాలెం, గిద్దలూరు, టంగుటూరులలో రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులు తెచ్చారు. అయితే మాగుంట తెచ్చారు కాబట్టి ఆ బ్రిడ్జిలకు రాష్ట్రప్రభుత్వం వాటా ఇవ్వలేదు. దీంతో విసిగివేసారిన మాగుంట మొత్తం కేంద్రం నిధులతోనే ఆ పనులు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినా భూసేకరణ విషయంలో ప్రభుత్వం సహకరించకపోవటంతో అవి ముందడుగు వేయలేదు. మరోవైపు ఎంపీ నిధులతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పను లు చేపడుతుంటే స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మె ల్యేలు, ఇన్‌చార్జిల ద్వారా అడ్డుపుల్లలు వేయించారు. అదేసమయంలో మాగుంట అనూహ్యంగా కేసుల్లో చిక్కుకున్నారు. అయితే ఏమిటి సమస్య అని సీఎం అడిగిన దాఖలాలు లేవు. ఇంత జరిగినా వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్న ఆయనకు టికెట్‌ విషయంలో మొండిచేయి చూపారు.

చివర్లో మెలిక

ఇన్ని చేసినా సర్దుకుపోయిన మాగుంటకు టికెట్‌ లేదన్న అంశాన్ని పరోక్షంగా తెలియజేశారు. ఆయ న అభిమతానికి వ్యతిరేకంగా కొన్ని షరతులు విధించారు. కాదు అంటే తన గడప తొక్కని వ్వద్దని జగన్‌ ఆదేశించారు. అయితే చివర్లో ఆయనకు టికెట్‌ లేదనే విషయాన్ని అధి కారికంగా ప్రకటించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ప్రారంభించారు. మాగుంటకు కలిసి మాట్లాడే అవ కాశం ఇవ్వకపోగా చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నియమించారు. ముందు గానే పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు లోక్‌సభలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను చేర్పులు మార్పులతో ఖరారుచేశారు. పార్టీ బాధ్యతలు అప్పగించి ఒంగోలు పంపిన చెవిరెడ్డికి మాత్రం ఎంపీ అభ్యర్థి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఆపేశారు. ఇటీవల ఒంగోలు వచ్చిన జగన్‌ వేదిక కింద ముఖ్య నాయకులందరితో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డేనని బహిరంగంగా చెప్పారు. కానీ ఇప్పటి వరకూ జగన్‌ అధికారికంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం విశేషం. తనకు నచ్చని మాగుంటను మానసిక క్షోభకు గురిచేసి తన పలు కు బడిని తగ్గించేం దుకు ఆయన బయటకెళ్లాడు కాబట్టి కొత్త అభ్యర్థిని ఇచ్చానని ప్రకటించేందుకు ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తేటతెల్లమవుతోంది. తాజాగా తన సోషల్‌ మీడియా ప్రతినిఽధుల ద్వారా మాగుంట నడవడికపై విషంకక్కే ప్రయత్నం ప్రారంభించారు.

మాగుంట కీలకమంతనాలు

ఈ దశలో ఎంపీ మాగుంట మంగళ, బుధవారాల్లో నియోజకవర్గంలోని తన అనుచరులు, అభిమానులతో కీలక మంతనాలు జరిపేం దుకు సిద్ధమయ్యారు. ఒంగోలులో జరిగిన సీఎం సభకు కూడా పార్టీపరంగా ఆహ్వానించకపోవడంతోపాటు వైసీపీలో తనకు జరిగిన అవమానాలను, వ్యాపారపరంగా వ్యక్తిగతంగా, గౌరవమర్యాదల పరంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అభిమానులకు వివరించి తన రాజకీయ భవితవ్యంపై వారి అభిప్రాయం తెలుసుకు నేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. నిజానికి మాగుంట కుమారుడు రాఘవరెడ్డికి టీడీపీ టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఎప్పుడో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైసీపీలో తన ప్రయత్నాలు ఫలించని దశలో ఆ వైపు అడుగులువేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా మాగుంట టీడీపీ వైపు అడుగులను బీజేపీ అడ్డుకుంటున్నదంటూ ప్రచారం ప్రారంభించటం ఆయన అభిమానుల్లో మరింత ఆగ్రహాన్ని రగిలించింది. తదనుగుణంగా మాగుంట మంగళ, బుధవారాల్లో అనుచరులతో మంత నాలు జరిపి 29వతేదీ వైసీపీకి గుడ్‌బై చెప్పా లని భావిస్తున్నట్లు తెలిసింది.

వైసీపీ సామగ్రి తీసుకోని కందుకూరు నేతలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో వైసీపీకి అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. అక్కడున్న సీనియర్‌ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని కాదని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన విద్యాసంస్థల అధిపతి పెంచలయ్య కుమార్తె అరవిందను పార్టీ ఇన్‌చార్జిగా జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చేనెల 3వ తేదీ మేదరమెట్లకు సమీపంలో జరిగే సిద్ధం బహిరంగసభకు వైసీసీ సిద్ధమైంది. ఆ మేరకు ఆ సభలో పాల్గొనాల్సిన మూడు జిల్లాల్లోని నియోజ కవర్గాలన్నింటికీ ప్రచార సామగ్రి పంపడాన్ని వైసీపీ ప్రారంభించింది. ఆ ప్రకారం కందుకూరుకు సంబంధించిన ప్రచార సామగ్రి సోమవారం ప్రత్యేక వాహనంలో అక్కడికి చేరాయి. అయితే అరవింద ఇంతవరకూ కందుకూరు రాకపోగా మహీధర్‌రెడ్డి కార్యాలయం మాత్రం కొనసాగుతోంది. దీంతో ఐప్యాక్‌ ప్రతినిధులు సామగ్రి వాహనాన్ని మహీధర్‌రెడ్డి కార్యాలయానికి పంపారు. ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉండగా కార్యాలయ సిబ్బంది ఆయనకు చెప్పకుండా మేము ఎలాంటి సామగ్రి తీసుకోలేమని తేల్చిచెప్పారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో లారీని వెనక్కు పిలిపించుకున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 07:44 AM