Share News

AP Elections 2024: ఎన్నికల ముందు రాక్షస కక్ష!

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:44 AM

కొల్లి రఘురామిరెడ్డి, ఐపీఎస్‌.. రాజధాని అమరావతి భూములపై జగన్‌ వేసిన ‘సిట్‌’ అధిపతి ఆయనే. ‘స్కిల్‌’ డెవల్‌పమెంట్‌ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసింది ఆయనే. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం అధిపతి హోదాలో ఇటీవల టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.నారాయణ

AP Elections 2024: ఎన్నికల ముందు రాక్షస కక్ష!

 • ఎన్నికల ముందు మరో వికృత క్రీడ

 • బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా

 • ఎవరినైనా లక్ష్యం చేసుకునేలా వ్యూహం

 • విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు కొత్త కోరలు

 • ఏకంగా 12 శాఖలు, 13 చట్టాలపై పట్టు

 • ఏకపక్షంగా తనిఖీలు, జప్తులకు వీలు

 • వారెంట్‌ లేకున్నా అరెస్టు చేసే అధికారం

 • అపరిమిత అధికారాలు కోరిన ఐపీఎస్‌ కొల్లి

 • ఫైల్‌ కదిపిన ప్రభుత్వం.. ప్రస్తుతం న్యాయ శాఖ వద్ద

 • పురాణాల్లో బకాసురుడికి రోజుకొక

 • నరుడిని తింటేగానీ తీరని ఆకలి!

 • ఇప్పుడు అధికార వైసీపీకి విపక్ష నేతలను

 • వేధించుకు తింటేగానీ తీరని ఆకలి!

పోలీసు, సీఐడీ, ఏసీబీ, గనులు, ఔషధ నియంత్రణ... (AP Police) ఇలా అనేక విభాగాల అధికారులను విపక్షాల మీదికి ఉసిగొల్పుతూ వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, కేసుల్లో ఇరికించడం! దాదాపు ఐదేళ్లుగా ఇదే ‘రాక్షసత్వం’! ఇలా విడివిడిగా పంపే రాక్షసులు సరిపోవడంలేదంటూ... ఇప్పుడు ఎన్నికల ముందు ఒక ‘బ్రహ్మ రాక్షసి’ని సృష్టిస్తున్నారు. అదే... కొత్త కోరలు, అస్త్రాలతో కూడిన రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం’. దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రాణం పోసుకుంది. న్యాయశాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. వారు అనుకున్నది జరిగితే... ‘బ్రహ్మ రాక్షసి’ రెడీ! రోడ్డుపక్కన బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని, వేధించుకుని తినొచ్చు. ఈ కొత్త ప్రతిపాదనలు చేసింది ఎవరో కాదు! ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డి!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొల్లి రఘురామిరెడ్డి, ఐపీఎస్‌.. రాజధాని అమరావతి భూములపై జగన్‌ వేసిన ‘సిట్‌’ అధిపతి ఆయనే. ‘స్కిల్‌’ డెవల్‌పమెంట్‌ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసింది ఆయనే. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం అధిపతి హోదాలో ఇటీవల టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.నారాయణ నివాసంపై విరుచుకుపడిందీ ఆయనే. రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చీఫ్‌ కూడా ఆయనే! ఆయన నుంచి ఒక అసాధారణ ప్రతిపాదన వచ్చింది. అది అమలైతే.... ‘విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ విభాగం ఒక అసాధారణ శక్తిగా మారుతుంది. దానిని జగన్‌ సర్కారు ‘అరాచక శక్తి’గా మార్చడమూ ఖాయంగా కనిపిస్తోంది.

ఇదీ స్కెచ్‌...

రాష్ట్రంలోని అన్ని కీలక, ఇంజనీరింగ్‌ విభాగాల్లో విజిలెన్స్‌ వింగ్‌ ఉంటుంది. తమ శాఖలో జరిగిన లోటుపాట్లపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇక... రాష్ట్రస్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఉంటుంది. మీడియాలో వచ్చే వార్తలు, తమకు అందే ఫిర్యాదులతోపాటు సుమోటోగా కూడా స్పందించి ఆయా అంశాలపై విచారణ జరపవచ్చు. ప్రభుత్వానికి నష్టం కలిగించే చర్యలను గుర్తించి బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయవచ్చు. దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. ప్రస్తుతం ఈ విభాగానికి కొల్లి రఘురామిరెడ్డి అధిపతిగా ఉన్నారు. ఈనెల 5వ తేదీన ప్రభుత్వానికి ఒక అసాధారణ ప్రతిపాదన పంపించారు. పది పేజీల లేఖలోని అంశాలను క్లుప్తంగా చెప్పాలంటే... ‘రాష్ట్రంలోని అన్ని కీలక శాఖలకు చెందిన అధికారాలను నాకే అప్పగించండి. నేను సూపర్‌ పవర్‌గా మారి... అన్ని రకాల అక్రమాలను అరికట్టి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా అడ్డుకుంటా!’ అని తెలిపారు. దీని ప్రకారం... పన్నులు, పన్నేతర విభాగాలన్నింటిపైనా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి పట్టు లభిస్తుంది. ప్రభుత్వ నిధులు, ఆస్తులు, సహజ వనరులు... ఇలా ఏ రూపంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా, అది ఏ శాఖ పరిధిలోనిదైనా రంగంలోకి దిగుతుంది. ఎక్కడైనా చొరబడి, తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించి, స్వాధీనం చేసుకుని, అవసరమైతే అరెస్టు చేసే అధికారాలు లభిస్తాయి. ఆ మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలోని గెజిటెడ్‌ ఆఫీసర్లకు అధికారాలు ఇవ్వాలని కొల్లి రఘురామిరెడ్డి కోరారు.

తమ పరిధిలోకి తేవాలంటూ ‘కొల్లి’ కోరిన చట్టాలు ఇవే...

1. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్టీ చట్టం-2017,

2. ఆంధ్రప్రదేశ్‌ విలువ ఆధారిత పన్ను చట్టం-2005,

3. ఆంధ్రప్రదేశ్‌ టాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్‌, ట్రేడ్స్‌, కాలింగ్స్‌ మరియు ఉపాధి చట్టం-1987

4. కేంద్ర అమ్మకం పన్నుల చట్టం-1956

5. ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ చట్టం-1968

6. భారతీయ స్టాంప్‌చట్టం-1899

7. రిజిస్ట్రేషన్‌ చట్టం-1908

8. ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్‌-1939

9. గనులు, ఖనిజాల చట్టం-1957

10. ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల పన్ను చట్టం-1963

11. సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం-2001

12. ఆంధ్రా ఏరియా టౌన్‌ప్లానింగ్‌ చట్టం-1920

13. ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం-1967

అన్నీ ఆయన పరిధిలోకే...

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఏయే చట్టాల ప్రకారం కొత్త అధికారాలు కట్టబెట్టవచ్చో కూడా కొల్లి రఘురామిరెడ్డి వివరించారు. ఏకంగా 12 ప్రభుత్వ శాఖలు, వాటి పరిధిలోని 13 చట్టాల అమలు బాధ్యత తమకే కావాలని కోరారు. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, జీఎస్టీ, వాణిజ్య పన్నులు, రవాణా, సొసైటీ రిజిస్ట్రేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌, అటవీ, ఎక్సైజ్‌, విద్యుత్తు, గనులు, ఆర్థిక శాఖకు సంబంధించిన పలు చట్టాలను ఉదహరించారు. వాటన్నింటి ప్రకారం రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు అధికారాలు కట్టబెట్టారని... విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ‘అంతకుమించి’ పవర్స్‌ కావాలని ప్రతిపాదించారు. అంటే... రాష్ట్రంలోని అన్ని కీలక శాఖలు చేసే పనులన్నీ తామే చేస్తానని చెప్పడమే.

ఇదీ ఆయన చెప్పిన కారణం..

‘‘విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టికి వచ్చిన అనేక ఆరోపణలపై విచారణలు చేసే సమయంలో గోప్యత పాటిస్తాం. కానీ... కొన్ని శాఖల నుంచి వచ్చే సమస్యల వల్ల రహస్యాలను కాపాడే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతులు, కలెక్టరేట్లు, ఇతర విభాగాల్లోని రికార్డులు, సమాచారం తీసుకునే అధికారం మాకు ఉంది. అయితే... ఇది కేవలం ఎగ్జిక్యూటివ్‌ అధికారం మాత్రమే. దీనికి చట్టబద్ధమైన బలం లేదు’’ అని కొల్లి వివరించారు. అందుకే... విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు మరిన్ని కోరలు తొడగాలని కోరారు.

పెద్దల సూచన మేరకేనా...

రాష్ట్రంలో ఏసీబీ, లోకాయుక్త, ఇంకా అనేకానేక స్వతంత్ర సంస్థలు పనిచేస్తున్నాయి. కీలక శాఖలకు సొంతంగా విజిలెన్స్‌ విభాగాలు ఉన్నాయి. ఆయా శాఖలకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి. అవేవీ ఇతర శాఖల విధుల్లో తలదూర్చడానికి వీల్లేదు. ఇతరుల అధికారాలు తమకు ఇవ్వాలని కోరడానికి లేదు. అలా కోరడమంటే ఆయా శాఖలన్నీ విఫలమయ్యాయి అని చెప్పడమే. కానీ... ఇప్పుడు అన్ని శాఖల అధికారాలను తమకు ఇవ్వాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చీఫ్‌ అధికారికంగా లేఖ రాయడం గమనార్హం. ఒక ఐపీఎస్‌ అధికారి నుంచి ఇలాంటి ప్రతిపాదనలు రావడం అసాధారణమని, ప్రభుత్వ పెద్దల సూచన మేరకే ఆయన ఈ లేఖ రాసి ఉండొచ్చని ప్రభుత్వ పాలనపై పూర్తి అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. కొల్లి ఇలా లేఖ రాయడమే ఆలస్యం... సచివాలయంలో ఫైలు కూడా కదలడం దీనికి బలం చేకూరుస్తోంది. అనేక చట్టాలు, విభాగాలకు సంబంధించింది కావడంతో న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

విపక్షాలే లక్ష్యం...

జగన్‌ ఇప్పటికే అన్ని కీలక విభాగాలను కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ‘సూపర్‌ పవర్‌’గా మార్చేస్తున్నారు. అదే జరిగితే... విపక్ష నేతలు, గిట్టని వ్యక్తులు, సంస్థలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లోకి చొరబడి సోదాల పేరుతో వేధించవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పరిధి, జీఎస్టీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, వస్తువుల ఉత్పత్తి, రవాణా, పన్నుల మదింపు, పన్నుల పరిశీలన, వృత్తిపన్ను, ట్రేడర్లు, ఉపాధి కల్పన పరిధిలోని విభాగాల్లో ఖాతాలు, పత్రాల పరిశీలన, తనిఖీలు, అవసరాన్ని బట్టి అరె్‌స్టలు, అవసరాన్ని బట్టి ఆస్తుల జప్తు, కేంద్ర అమ్మకం పన్ను చట్టం ప్రకారం అవసరమైతే ఏదైనా సంస్థ చెల్లించిన పన్నును పునఃసమీక్షించడం, ఎక్సైజ్‌ చట్టం ప్రకారం ముందస్తు వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయడం.... ఇలా అనేక మితిమీరిన అధికారాలు ‘విజిలెన్స్‌’కు దక్కుతాయి. ఈ లెక్కన ఇడ్లీ బండి నుంచి కార్పొరేట్‌ కంపెనీల వరకు అన్నీ ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి... అదీ కొల్లి రఘురామిరెడ్డి నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. ఎందుకొటే... ‘జగన్‌ శాసిస్తారు. కొల్లి పాటిస్తారు’ అనే పేరు ఇప్పటికే ఉంది. ఎన్నికల ముందు విపక్ష నేతలను మరింతగా ఇబ్బంది పెట్టేందుకే తాజా ప్రతిపాదనను తెరపైకి తెచ్చారనే అనుమానం కలుగుతోంది.

Updated Date - Mar 01 , 2024 | 07:47 AM